IT Employees: 80 శాతం ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి! కారణం ఏంటంటే?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. దీనికి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఓ కారణమైతే.. గంటల తరబడి కూర్చొని పనిచేసే ఉద్యోగాలు మరో కారణం. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో ఐటీ ఉద్యోగుల్లో 80 శాతం మందిని ఓ జబ్బు వేధిస్తోంది. అదెంటో ఇక్కడ తెలుసుకుందాం.

IT Jobs Lifestyle Disease Affects 80 Percent Study in telugu KVG

భారతదేశంలో 80 శాతం ఐటీ ఉద్యోగులకు ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్లు కొత్త అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐటీ ఉద్యోగులు మెటబోలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD) బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

'కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం వల్ల అవయవానికి నష్టం వాటిల్లుతుంది. సాధారణ BMI ఉన్నప్పటికీ కొంతమందికి ఈ వ్యాధి వస్తుంది...' అని పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

'శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం కాలేయం. రక్తాన్ని శుద్ధి చేయడం, శక్తిని నిల్వ చేయడం, జీర్ణక్రియకు సహాయపడటం కాలేయం చేసే పనులు. కొన్నిసార్లు అవయవంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు అది దెబ్బతింటుంది. ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. కాలేయం సాధారణం కంటే ఎక్కువ కొవ్వును నిల్వ చేసినప్పుడు, అది మరింత వాపుకు గురవుతుంది. ఇది లివర్ ఫెయిల్యూర్ సహా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

ఫ్యాటీ లివర్ వ్యాధి ఒక నిశ్శబ్ద మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది ప్రజలు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. జీవనశైలి, చెడు అలవాట్లు ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతాయి. వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లాంటివి ఈ జబ్బు వచ్చే అవకాశాల్ని పెంచుతాయి.

71 శాతం ఐటీ ఉద్యోగులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలికి సంబంధించిన వ్యాధులే మరణానికి కారణం. 
వాటిలో గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ ఉన్నాయి. యువకుల్లో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు, ఎక్కువ చక్కెర తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంట్లో వండని ఆహారాలు తినడం ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.

ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

2. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. వేగంగా నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, కాలేయంలోని కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

3. ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయండి.

4. చక్కెర కలిపిన డ్రింక్స్ సహా ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన, జంక్ ఫుడ్‌లను ఖచ్చితంగా నివారించండి. ఇది కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా చేస్తుంది.

5. మద్యం సేవించడం తగ్గించండి లేదా మానేయండి.

6. కాలేయ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్‌లు చేయించుకోవడం చాలా అవసరం.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios