ఆహారాలు మన ఒంటికి శక్తిని ఇస్తాయి. కానీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాలను తింటే మాత్రం ఊబకాయంతో పాటుగా ఎన్నో వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని ఆహారాలను తింటే మీరు బరువు పెరిగిపోతారు. ఇంతకీ నైట్ టైం ఎలాంటి ఆహారాలను తినకూడదంటే.. 

రాత్రిపూట లేట్ గా పడుకునే వారే బరువు ఎక్కువగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెలుకువగా ఉండటం వల్ల ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇది కాస్త బరువు పెరగానికి దారితీస్తుంది. అంతేకాదు ఈ అలవాటు మీ జీవక్రియను దెబ్బతీస్తుంది. అంతేకాదు దీనివల్ల మీకు ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రాత్రి సమయంలో కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి ఊబకాయంతో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తాయి. 

రాత్రిపూట మనం పనిచేసినా చేయకపోయినా.. మన శరీరం మాత్రం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. నిజానికి మన శరీరంలో రక్తప్రవాహం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. బ్రెయిన్ కూడా తన పని తాను చేసుకుపోతుంది. ఇలాంటి సమయంలో కూడా కేలరీలను బర్న్ చేయడానికి మన శరీరానికి శక్తి అవసరం. ఇంతకీ రాత్రి పూట ఎలాంటి ఆహారాలను తినకూడదంటే.. 

ఆయిలీ, వేయించిన, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు

రాత్రిపూట ఎక్కువగా వేయించిన ఆహారాలను తినకూడదు. వీటితో పాటు జున్ను, రెడ్ మీట్, బర్గర్లు, పిజ్జాలకు దూరంగా ఉండాలి. ఇవి నోటికి రుచిగా అనిపించినా వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది అజీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలను ఎట్టిపరిస్థితిలో తినకండి. 

కారంగా ఉండే ఆహారం

నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు వస్తాయి. దీనివల్ల రాత్రిపూట కంటినిండా నిద్రపోరు. 

గ్యాస్ ఫార్మింగ్ ఫుడ్స్

శెనగపిండి, బ్రొకలి, రాజ్మా, శెనగలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తో చేసిన వంటకాలను రాత్రి పడుకునే ముందు తింటే అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇవి పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. 

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, సలాడ్లు, మొలకలు, చిక్కుళ్ళు మన శరీరాన్ని బలోపేతం చేస్తాయి. అయితే వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే మన శరీరానికి మంచి పోషణ అందుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు వీటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. 

కాఫీ

కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ రాత్రిపూట దీన్ని అసలే తాగకూడదు. నిజానికి రాత్రి భోజనం తర్వాత దీన్ని తాగితే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇది మిమ్మల్ని చురుగ్గా చేస్తుంది. దీనివల్ల మీకు అస్సలు నిద్ర రాదు.