కొన్ని రకాల వ్యాధులు అంత తొందరగా బయటపడవు. అవి మనకుండొచ్చు.. కానీ వాటిని మాత్రం మనం కనిపెట్టకపోవచ్చు. అయితే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధులు కూడా కామన్ గా ప్రతిఒక్కరినీ ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..  

జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక రోగాలకు గురవుతారు. కానీ కొన్ని వ్యాధులను అంత సులువుగా గుర్తించలేం. అయితే ఇలాంటి వాటిని ప్రారంభంలోనే గుర్తిస్తే వీటిని తొందరగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. కానీ ఇలాంటి అనారోగ్య సమస్యల లక్షణాలను గుర్తించాలంటే వాటి సంకేతాలను ముందుగా గుర్తించడం లేదా క్రమం తప్పకుండా ఆరోగ్య స్క్రీనింగ్ల ద్వారే సాధ్యం అవుతుంది. అయితే కొన్ని వ్యాధులు మాత్రం ఎలాంటి లక్షణాలను చూపించవు. అంటే ఇవి రోగం ముదిరినంకనే సంకేతాలను చూపిస్తాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలనే సైలెంట్ కిల్లర్స్ అంటారు. అలాంటి వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అధిక రక్తపోటు

ప్రస్తుత కాలంలో హై బీపీ సమస్య చిన్న వారికి కూడా వస్తోంది. ఇది అన్ని రకాల సైలెంట్ కిల్లర్ వ్యాధులలో ముందుంటుంది. అధిక రక్తపోటును నియంత్రించకపోయినా, దాన్ని నిర్వహించకపోయినా ఇది గుండెపోటు, స్ట్రోక్ తో సహా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే రక్తపోటు ఉన్న చాలా మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు.

అధిక కొలెస్ట్రాల్

అధిక కొలెస్ట్రాల్ ను కూడా సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే శరీరలో స్థాయిలు పెరిగిపోయేంత వరకు ఈ వ్యాధి ఎలాంటి లక్షణాలను చూపించదు. రక్తంలో ఎల్డిఎల్ 'చెడు' కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే కొవ్వు పదార్ధం ఎక్కువైనప్పుడు అధిక కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వస్తుంది. 

డయాబెటిస్

డయాబెటిస్ వల్ల రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతాయి. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఈ రోజుల్లో డయాబెటీస్ సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఈ వ్యాధిని కూడా సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నా.. దీన్ని గుర్తించలేకపోతుంటారు. డయాబెటీస్ సమస్య ఎక్కువైనప్పుడు మాత్రమే దీని లక్షణాలు కనిపిస్తాయి. 

క్యాన్సర్

క్యాన్సర్ ప్రాణాంతక రోగం. దీనిబారిన పడి ప్రతి ఏడాది ఎంతో మంది అర్థాంతరంగా చనిపోతున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో సహా చాలా రకాల క్యాన్సర్లను నిశ్శబ్ద క్యాన్సర్లు అంటారు. ఎందుకంటే వీటిని స్క్రీనింగ్ ద్వారా మాత్రమే గుర్తిస్తాం. ఇది క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడాలంటే వీటిని ప్రారంభంలోనే గుర్తించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల స్టేజ్ ని బట్టి చికిత్సను చేస్తారు. 

కొవ్వు కాలేయ వ్యాధి

కొవ్వు కాలేయ వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డి). రెండు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. దీనిని ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అని కూడా పిలుస్తారు. ఎన్ఎఎఫ్ఎల్డి అనేది ఒక రకమైన కొవ్వు కాలేయం. ఇది ఆల్కహాల్ వినియోగానికి సంబంధించినది కాదు. అయితే ఎఎఫ్ఎల్డి మాత్రం ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల వస్తుంది. కొవ్వు కాలేయ వ్యాధి రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే దీని లక్షణాలు అంత తొందరగా బయటపడవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి వేరే సమస్య వల్ల వచ్చినట్టుగా భావిస్తారు.