మధ్యాహ్న భోజనం తర్వాత కూడా యాక్టీవ్ గా ఉండాలనుకుంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ఈ ఆహారాలు మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 

చాలా మంది ఉదయం ఎనర్జిటిక్ గానే ఉంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత డల్ గా, నిద్రమత్తుగా, సత్తువ లేనట్టుగా కనిపిస్తారు. ఇకపోతే కొంతమంది మాత్రం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. నిజానికి ఒంట్లో శక్తి తగ్గడానికి మనం తినే ఫుడ్ కు సంబంధం ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను పొందకపోతే కూడా శరీరం చురుగ్గా ఉండదు. మరి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కార్బోహైడ్రేట్లు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కార్బోహైడ్రేట్ మనకు శక్తినిచ్చే ప్రధాన పోషకం. శ్వాస, బ్లడ్ పంపింగ్ వంటి కొన్ని సాధారణ చర్యలకు గ్లూకోజ్ వినియోగం చాలా అవసరం. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయల వరకు అన్నింటిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ కార్భోహైడ్రేట్లను మోతాదులో తీసుకుంటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

కొవ్వు

డైటింగ్, వ్యాయామాల ద్వారా శరీర కొవ్వును కరిగించుకోవడానికి ప్రయత్నించే వారు చాలా మందే ఉన్నారు. నిజమేంటంటే.. మీ ఆహారంలో తగినంత కొవ్వు లేకపోతే మీ శరీరంలో శక్తి స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీనివల్ల మీరు త్వరగా ఆకలి అవుతుంది. ఏకాగ్రతను కూడా కోల్పోతారు. ఆరోగ్యకరమైన కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం, మీ భోజనంలో కొద్దిపాటి కొవ్వును జోడించడం వల్ల మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. ఆలివ్ ఆయిల్, కొన్ని రకాల గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 

ఫైబర్

ఫైబర్ మన కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలతో పాటు బ్లాక్ బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బాదంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ శక్తిస్థాయిలను కూడా పెంచుతాయి. 

బి విటమిన్లు

అన్ని బి విటమిన్లు మీరు తినే ఆహారాన్ని గ్లూకోజ్ గా మార్చి మీ శరీర జీవక్రియకు సహాయపడతాయి. చికెన్, గుడ్లు, పాల ఉత్పత్తులు బి విటమిన్లకు ఉత్తమ వనరులు. కానీ శాఖాహారులు వీటిని కాయధాన్యాలు, సోయా పాలు, కాయలు, చిక్కుళ్ళ ద్వారా పొందాల్సి ఉంటుంది. 

ఇనుము

ఎర్ర రక్త కణాలలో కనిపించే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఇనుము నుంచి ఏర్పడుతుంది. ఇది మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇది శరీరమంతా ఆక్సిజన్ రవాణాకు సహాయపడుతుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. గింజలు, ఆకుకూరలు, చికెన్, కాయలు, విత్తనాలలో ఇనుము పుష్కలంగా ఉంటుంది.