ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలను పెరుగులో కలిపి తినకూడదు. ఒకవేళ అలాగే తింటే చర్మ అలెర్జీ, అజీర్థి వంటి సమస్యలు వస్తాయి.
ఎండాకాలంలో కప్పు పెరుగును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నిజానికి సీజన్లతో సంబంధం లేకుండా పెరుగును తినొచ్చు. ఎందుకంటే ఇది మన శారీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఇతర ఆహారాల నుంచి పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కానీ ఈ పోషకాలు పెరుగుతో తప్పుడు ఆహారాన్ని తిన్నప్పుడు మన శరీరాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే. కానీ వీటిని పెరుగుతో కలిపి తింటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పెరుగుతో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు ప్రయోజనాలు
పెరుగు కిణ్వ ప్రక్రియ ద్వారా తయారైన పాల ఉత్పత్తి. ఇది మన మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. యోని ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.
మామిడి
మామిడి వేడిచేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పెరుగేమో చలువ చేసే గుణాన్ని కలిగుంటుంది. ఈ రెండింటినీ కలిపినప్పుడు జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత కలుగుతుంది. అంతేకాదు ఇది చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ రెండు ఆహారాలు కలిసి మీ శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ కు దూరంగా ఉండండి.
ఉల్లిపాయ
పెరుగు, మామిడి కాంబినేషన్ మాదిరిగానే.. ఉల్లిపాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగు చల్లగా ఉంటుంది. ఈ రెండు ఆహారాలను కలిపినప్పుడు చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీల సమస్యలు వస్తాయి.
పాలు
ఇది కాస్త వింతగా అనిపించొచ్చు. పెరుగు పాల నుంచే వస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎందుకు మంచిది కాదు అని? అయితే పాలు, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ రెండింటిలో ప్రోటీన్, కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
చేపలు
చేపలతో పెరుగును ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. జంతు ప్రోటీన్ ను వెజ్ ప్రోటీన్ తో కలిపి తీసుకుంటే మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ రెండు జీర్ణం కావడం చాలా కష్టమవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
