కరివేపాకు నూనెతో జుట్టు రాలకుండా పొడుగ్గా పెరుగుతుంది.. దీన్ని ఎలా తయారుచేయాలంటే?
కరివేపాకు వంటలకు మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికి, అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు తెలుసా? కరివేపాకును ఉపయోగించి నూనెను తయారుచేసి జుట్టుకు పెడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మందంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

కరివేపాకు నూనె
ఆడవాళ్లకు పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. నిజానికి పొడవాటి జుట్టు ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. అందుకే జుట్టు పొడుగ్గా పెరిగేందుకు ఆడవారు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పొడవాటి జుట్టు ఉండటం కష్టమే. ఎందుకంటే పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది ఆడవారు హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్య తగ్గాలంటే మాత్రం జుట్టుకు బలాన్నిచ్చే నూనెలను వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే హెయిర్ ఫాల్ ను తగ్గించి జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచేందుకు కరివేపాకు నూనె బాగా సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టు పెరుగుదలకు కరివేపాకు
చాలా మంది ఆడవారు జుట్టు పొడుగ్గా పెరగాలంటే మార్కెట్ లో ఉండే ఖరీదైన నూనెలను కొని వాడుతుంటారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో రూపాయి ఖర్చు లేకుండా జుట్టును పెరిగేలా చేయొచ్చు. అవును కరివేపాకు నూనె పెడితే మీ జుట్టు పక్కాగా పెరుగుతుంది.
ఈ కరివేపాకులో అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు చివర్ల వరకు వెళ్లి జుట్టు సమస్యలన్నింటిని తగ్గించడానికి సహాయపడతాయి. కరివేపాకులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్ కూడా ఉంటాయి. ఇవి జుట్టును పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు కరివేపాకు నూనె మీ జుట్టును నల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
జుట్టు పెరగడానికి కరివేపాకు నూనెను ఎలా తయారుచేయాలి?
కరివేపాకు నూనెను తయారుచేయడానికి రెండు పిడికెడ్ల కరివేపాకు రెబ్బలు, 200 గ్రాముల కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల మెంతులు, ఒక ఉసిరికాయ అవసరమవుతాయి.
తయారీ విధానం
కరివేపాకు నూనెను తయారుచేయడానికి ముందుగా కరివేపాకులను బాగా కడిగి నీడలోనే ఆరబెట్టండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనెను పోసి మరిగించండి. కొబ్బరి నూనె వేడిగా అవుతున్నప్పుడు అందులో ఆరబెట్టిన కరివేపాకులను, మెతులను, ఉసిరికాయను వేసి తేలికగా వేయించండి. ఇది బాగా మరిగిన తర్వాత నూనెను వడగట్టండి. అంతే ఎంతో సింపుల్ గా కరివేపాకు నూనె రెడీ అయినట్టే.
కరివేపాకు నూనెను ఎలా ఉపయోగించాలి
నూనెను తయారుచేసిన తర్వాత ఒక గాజు సీసాలో దీన్ని నిల్వ చేయండి. ఈ కొబ్బరి నూనెను జుట్టంతా బాగా పట్టించాలి. ఈ నూనెను వారానికి ఒకసారి జుట్టుకు పెట్టాలి. కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి కాసేపు మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కరివేపాకులోని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, పోషకాలు మీ జుట్టును ఫాస్ట్ గా పెంచడానికి సహాయపడతాయి.