Face Glow: శనగపిండిలో ఇవి కలిపి రాస్తే.. ముఖం కాంతివంతంగా మారడం పక్కా
మన చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసే ప్రాపర్టీలు శనగపిండిలో పుష్కలంగా ఉంటాయి. శనగపిండిలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి.

శనగపిండితో మెరిసే చర్మం..
వయసు పెరుగుతుంటే... చర్మంపై ముడతలు రావడం సహజం. ఇక కొందరికి వయసుతో సంబంధం లేకుండా మొటిమలు, నల్ల మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివారు వాటిని తగ్గించడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. అయితే.. మనం మన ఇంట్లో సులభంగా లభించే శనగపిండిని రాసినా కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మరి, ఈ శనగ పిండిలో ఏం కలిపి రాస్తే.. మన ముఖం మెరుస్తుందో తెలుసుకుందాం..
మన చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసే ప్రాపర్టీలు శనగపిండిలో పుష్కలంగా ఉంటాయి. శనగపిండిలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. రంధ్రాల్లోని మురికిని, అదనపు నూనెను తొలగించడం ద్వారా మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
శనగ పిండిలో ఇవి కలిపి రాస్తే..
శనగపిండి–పెరుగు
శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. మంచిగా ముఖాన్ని మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ, మృదుత్వం వస్తుంది. అదే విధంగా, శనగపిండి–తేనె ప్యాక్‌లో తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి మచ్చలను తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు పాలు కలిపి రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి.
మరొక మంచి ఆప్షన్ శనగపిండి–కాఫీ–పెరుగు ప్యాక్... 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి రాసి 20 నిమిషాల తర్వాత కడిగితే రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. టమోటా జ్యూస్ లో శనగపిండి,పెరుగు కలిపి ముఖానికి రాస్తే.. నల్లటి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీస్పూన్ టమోటా రసం, 1 టీస్పూన్ పెరుగు కలిపి 15 నిమిషాల తర్వాత కడగాలి. రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖంలో మార్పులు సహజంగా చూస్తారు.
శనగ పిండిలో కలబంద కలిపి ముఖానికి రాస్తే..
చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి శనగపిండి,కలబంద జెల్ ప్యాక్ ఉపయోగకరం. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, సమాన మోతాదులో కలబంద గుజ్జు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి ముఖం, మెడపై రాసి 10 నిమిషాల తర్వాత కడగాలి. బొప్పాయి గుజ్జుతో చేసిన శనగపిండి,బొప్పాయి,రోజ్ వాటర్ ప్యాక్ చర్మంలోని మృత కణాలను తొలగించి ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి 15 నిమిషాల తర్వాత కడగాలి.
ఏ ఫేస్‌ప్యాక్ అయినా ముఖానికి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం అవసరం. అలెర్జీ లేదా చర్మ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి. వారానికి 2–3 సార్లు మాత్రమే ఫేస్‌ప్యాక్ వాడడం మంచిది. ఈ శనగపిండి ఫేస్‌ప్యాక్‌లు సహజమైన, రసాయన రహితమైన స్కిన్ కేర్ కి మంచి పరిష్కారం. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.