- Home
- Telangana
- Weather Update: ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ అలర్ట్
Weather Update: ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తాయి. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏపీ, తెలంగాణలో మళ్లీ వానలు.. పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో గురువారం రాత్రి దాటాక, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాన దంచికొట్టింది. దాదాపు రెండు మూడు గంటల పాటు కుండపోతగా పడటంతో సిటీ మొత్తం తడిసిముద్దయింది.
ఉదయం 4.30 గంటల తర్వాత వర్షం కొంచెం తగ్గినా, చాలా చోట్ల చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఎలాంటి ముందస్తు హింట్ లేకుండా రాత్రి వాన పడటంతో, ఉదయాన్నే పనుల మీద బయటకు వచ్చిన వాళ్లకు, వాహనదారులకు కొంచెం ఇబ్బంది తప్పలేదు.
సిటీలోని ఏ ఏరియాల్లో ఎంత వాన పడిందంటే?
హైదరాబాద్‌లోని పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలతో పాటు చాలా ఏరియాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. అమీర్‌పేట్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, బేగంపేట్, బాలానగర్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కూకట్పల్లి, కాప్రా, మల్కాజిగిరి ఏరియాలలో వాన కురిసింది.
వీటితో పాటు ఉప్పల్, నాగోల్, పెద్ద అంబర్పేట్, హయత్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడ్చల్ జిల్లా కీసరలో కూడా వర్షం పడింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసరాల్లోని మోండా మార్కెట్, రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, మారేడుపల్లి, బోయిన్పల్లి, రాణిగంజ్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్ తడిశాయి. కొన్నిచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చెరువుల్లా కనిపించాయి, డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి.
తెలంగాణలో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వానలు పడ్డాయి. గురువారం రాత్రి నుంచి నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షం పడింది. అక్కడి తాడూరు మండలం యంగంపల్లిలో 4.5 సెంటీమీటర్లు, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఊర్కొండలో 1.2 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ వాన కురిసింది.
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో 4 సెంటీమీటర్లు, చౌటకూర్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా షారాజీపేటలో 2 సెంటీమీటర్ల వర్షం పడింది. సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి అనే 5 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.
ఏపీలో మళ్లీ వానలు.. ఎక్కడ ఎంత రికార్డ్ అయింది?
ఇటీవల వరుస తుపానుల దెబ్బతో ఏపీలోని చాలా ప్రాంతాలు ఇబ్బంది పడ్డాయి. జనాలు ఇప్పుడిప్పుడే ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న టైమ్‌లో, బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే ఛాన్స్ ఉండటంతో మళ్లీ వర్షాలు దంచికొట్టబోతున్నాయి. శుక్రవారం నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వానలు పడొచ్చు. గురువారం సాయంత్రం నాటికి గుంటూరు జిల్లా తెనాలిలో 29.4 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ, గుంటూరు జిల్లా వడ్లమూడిలో 20.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వానలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రజలకు అధికారుల సూచనలు
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు జనాలు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షం, గాలులు వచ్చే టైమ్‌లో చెట్ల కింద, కరెంట్ పోల్స్ దగ్గర, పెద్ద హోర్డింగ్‌లు ఉన్న ఏరియాల్లో అస్సలు నిలబడొద్దు. వాతావరణం సరిగ్గా లేనప్పుడు వెంటనే సేఫ్ ప్లేస్‌లోకి వెళ్లడం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.















