Hyderabad: డిసెంబర్ 10న హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం.. ఎక్కడంటే?
Hyderabad: హైదరాబాద్‌లో యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు పేరుగాంచిన టెక్ దిగ్గజం యాపిల్.. నగరంలో తన తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించనుంది.

యాపిల్ తొలి స్టోర్ ఎక్కడంటే.?
హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతంలో ఈ కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. లేక్‌షోర్ – వై జంక్షన్ మాల్లో ‘Apple Kukatpally’ పేరుతో ఇది కొలువుదీరనుంది. డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం జరగనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే ఇతర బ్రాండ్ల రిటైల్ దుకాణాలు లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులు నేరుగా కంపెనీ అధికారిక స్టోర్‌ను సందర్శించి తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
హైదరాబాద్ ప్రత్యేకతను చాటేలా స్టోర్ డిజైన్
కొత్త స్టోర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో యాపిల్ ప్రత్యేకమైన బ్యారికేడ్ డిజైన్‌ను కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు ఉన్న ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ గుర్తింపును ప్రతిబింబించేలా ముత్యాల స్ఫూర్తితో ఈ డిజైన్‌ను రూపొందించింది. నగర చరిత్ర, సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక అలంకరణ స్థానికుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ అయిన యాపిల్.. తన కొత్త స్టోర్ ద్వారా హైదరాబాద్ ప్రత్యేకతను కూడా చాటిచెప్పే ప్రయత్నం చేసింది.
ఐఫోన్ల నుంచి మ్యాక్‌బుక్స్ వరకు అన్నీ ఒకేచోట
ఈ స్టోర్‌లో యాపిల్‌కు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇతర యాక్సెసరీలను నేరుగా పరిశీలించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా విడుదలయ్యే ఉత్పత్తులు, అందుబాటులో ఉన్న మోడళ్ల గురించి నిపుణుల నుంచి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఏ ఉత్పత్తి సరిపోతుందో ఎంచుకోవడంలో స్టోర్ సిబ్బంది సహాయం చేయనున్నారు.
అమ్మకాలే కాదు.. టెక్నికల్ సేవలు కూడా
యాపిల్ అధికారిక స్టోర్ల ప్రత్యేకత కేవలం ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కాదు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపైనా సంస్థ దృష్టి సారిస్తోంది. ఉత్పత్తుల వినియోగం, సాంకేతిక సందేహాలు, సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో నిపుణుల సహాయం పొందవచ్చు. వ్యాపార అవసరాల కోసం యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించే సంస్థలకు ప్రత్యేక బృందం ద్వారా మార్గదర్శకత్వం కూడా అందించనున్నారు. దీంతో కొత్తగా యాపిల్ పరికరాలు కొనుగోలు చేసేవారితో పాటు ఇప్పటికే వాటిని ఉపయోగిస్తున్నవారికీ ఈ స్టోర్ ఉపయోగపడనుంది.
ఉచిత శిక్షణ తరగతులు..
ఈ స్టోర్‌లో ‘Today at Apple’ కార్యక్రమం ద్వారా ఉచిత శిక్షణ సెషన్లు నిర్వహించనున్నారు. ఐఫోన్‌తో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీయడం, క్రియేటివిటీని పెంచుకోవడం, యాపిల్ పరికరాల్లోని ప్రత్యేక ఫీచర్లను సమర్థంగా ఉపయోగించడం వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తారు.
ప్రస్తుతం భారత్‌లో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, పుణె నగరాల్లో యాపిల్‌కు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ముంబైలో Apple BKC, Apple Borivali, ఢిల్లీలో Apple Saket, Apple Noida, బెంగళూరులో Apple Hebbal, పుణెలో Apple Koregaon Park స్టోర్లు పనిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న Apple Kukatpally ఈ జాబితాలో ఏడో స్థానాన్ని దక్కించుకోనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాపిల్.. కొత్త రిటైల్ స్టోర్‌తో నగరంలో తన వ్యాపార ఉనికిని మరింత విస్తరించనుంది.















