- Home
- Telangana
- IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Telangana Weather, Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాలను చలి గజగజా వణికిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో నమోదవుతున్న టెంపరేచర్స్ ఎలా ఉన్నాయంటే…

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి... అత్యంత చలి వాతావరణం కొనసాగుతోంది. మన్యం జిల్లాల్లో అత్యల్పంగా 3-6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఆశ్చర్యకరంగా వీటితో పోటీపడే స్థాయిలో హైదరాబాద్ లో చలి ఉంటోంది. తెలంగాణలో అతి తక్కువగా ఆదిలాబాద్ లో 6.2°C నమోదవగా హైదరాబాద్ లో కూడా 6.4°C ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఈ శీతాకాలంలోనే అత్యంత చలి
శుక్రవారం తెల్లవారుజామున ఈ శీతాకాలంలోనే అత్యంత చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ముందే హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో కూడా గడ్డకట్టే చలి ఉంటుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదేస్థాయిలో చలి ఉంది... గురవారం సాయంత్రం సమయంలోనే 15 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉంది... మరి అర్థరాత్రి, ఇవాళ తెల్లవారుజామున ఏ స్థాయికి పడిపోయి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
ప్రస్తుతం తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో అయితే 5°C పడిపోయాయి. శని, ఆదివారం (డిసెంబర్ 13,14) కూడా ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉంటాయని... చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ 16 నుండి చలితీవ్రత కాస్త తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ తెలంగాణ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త...
ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కొమ్రంభీ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ నాలుగైదు రోజులు 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అత్యంత చలిగాలుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతాజిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట... వీటికి ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
ఏపీలో లోయెస్ట్ టెంపరేచర్స్
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు వ్యాలీలో 4.4, డుంబ్రిగూడలో 4.7 డిగ్రీ సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి. మాడుగులలో 4.8, మంచంగిపుట్టలో 5, పాడేరులో 5.2, చింతపల్లిలో 6.2, పెదబయిలులో 6.7 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి.
ఇక మన్యం, కొండ ప్రాంతాల్లో సాయంత్రమే పొగమంచు కమ్ముకుంటోంది… అర్ధరాత్రులు, తెల్లవారుజామున దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. శీతాకాలంలో అరకు వాతావరణం ఆహ్లాదరకంగా ఉంటుంది... దీంతో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు... కానీ ప్రస్తుతం అత్యంత చలిగాలులు వీస్తుండటంతో సందర్శకుల తాకిడి పెద్దగా లేదు. ఈ చలి వాతావరణంలో అరకు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కుప్పకూలడానికి కాారణమిదే
తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోడానికి ఈశాన్య ప్రాంతాల నుండి వీస్తున్న చలిగాలులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి. అధికపీడనం కారణంగా చలిగాలులు భూమిని చేరుకుంటున్నాయని... ఇలా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో చలివాతావరణం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఇక్కడినుండి గాలులు దక్షిణాదివైపు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి పెరుగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది.

