- Home
- Telangana
- Viral Video: ఇది కశ్మీర్ కాదు మన హైదరాబాదే.. రోడ్డుపై భారీగా మంచు, వైరల్ అవుతోన్న వీడియోలు
Viral Video: ఇది కశ్మీర్ కాదు మన హైదరాబాదే.. రోడ్డుపై భారీగా మంచు, వైరల్ అవుతోన్న వీడియోలు
Viral Video: హైదరాబాద్ నగర శివార్లలో ఊహించని విధంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న సమయంలో, భారీ వడగళ్ల వాన కురవడంతో రోడ్లన్నీ తెల్లటి మంచుతో కప్పుకున్నట్టుగా మారాయి. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అకస్మాత్తుగా మారిన వాతావరణం
సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన తీవ్రంగా పడింది. వేడి వాతావరణం మధ్యలో ఇలాంటి వర్షం రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ORRపై మంచు ముసురు లాంటి దృశ్యం
శంషాబాద్ నుంచి నాదర్‌గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా వడగళ్లు కురిశాయి. కొద్ది సేపట్లోనే రోడ్డంతా తెల్లగా మారిపోయింది. ఆ ప్రాంతం మొత్తాన్ని చూస్తే నిజంగానే మంచు పడినట్టుగా కనిపించింది. ఈ దృశ్యం కశ్మీర్‌ను తలపించింది.
రోడ్లపైకి చేరిన ప్రజలు
ORRపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాము హైదరాబాద్‌లో ఉన్నామా లేక ఎక్కడైనా మంచు ప్రాంతంలో ఉన్నామా అన్న సందేహం కలిగింది. రోడ్లపై పేరుకున్న వడగళ్ల వల్ల కొంతమంది జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరు అక్కడే నిలబడి ఫోటోలు దిగగా, మరికొందరు రీల్స్ చేసి ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
వేసవిలో వడగళ్ల వాన ప్రత్యేకత
సాధారణంగా వేసవికాలంలో వడగళ్ల వాన అరుదుగా కనిపించినా, ఈసారి అది భారీ స్థాయిలో పడింది. వేడి వాతావరణంలో అకస్మాత్తుగా చల్లదనం రావడంతో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే, భారీ వడగళ్ల వర్షం వల్ల కొన్ని చోట్ల రోడ్లపై ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. దీనిని క్లౌడ్ బరెస్ట్‌గా చెబుతున్నారు. ఒకే చోట భారీ ఎత్తున వడగండ్ల వర్షం కురవడంతో ఇలా మంచు ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దీంతో హైదరాబాదీలకు సరికొత్త అనుభూతి దక్కింది.

