ఒకే గ్రామ పంచాయతీ.. కానీ ఇద్దరు సర్పంచ్ లు, రెండుసార్లు ఎన్నికలు..!
సాధారణంగా ఓ గ్రామ పంచాయతీకి ఒక్కరే సర్పంచ్ ఉంటారు. కానీ తెలంగాణలోని కొన్ని పంచాయతీలకు ఇద్దరు సర్పంచ్ లు ఉంటారు. ఆ పంచాయతీల ప్రజలకు కూడా రెండు ఓట్లు ఉంటాయి. ఆ పంచాయతీలేవి… ఇలా ఎందుకు ఉంటాయి?

తెలంగాణలో వింత గ్రామ పంచాయతీలు..
Telangana Gram panchayat elections 2025 : తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది... గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మూడు విడతల్లో రాష్ట్రంలోని 12,728 గ్రామ సర్పంచ్... 1,12,242 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషనర్ రాణి కుముదుని ప్రకటించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది... పలితాలను కూడా అదేరోజు విడుదల చేయనున్నారు.
సాధారణంగా ఓ గ్రామ పంచాయతీకి ఒక్కరే సర్పంచ్ ఉంటారు. అతడు ఉపసర్పంచ్, వార్డు మెంబర్లతో కలిసి గ్రామ పాలన చేపడుతుంటాడు. ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించి సర్పంచ్ ను ఎన్నకుంటారు. కానీ తెలంగాణలోని కొన్ని గ్రామాలకు ఇద్దరు సర్పంచ్ లు, రెండు పాలనా వ్యవస్థలు ఉంటాయి. చివరకు పంచాయతీ ఎన్నికలు కూడా రెండుసార్లు జరుగుతాయి... ప్రజలంతా రెండుసార్లు ఓటేస్తారు. ఈ విచిత్ర గ్రామాలేవో తెలుసుకుందాం.
ఇద్దరు సర్పంచులుండే గ్రామాలేవి..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రతో సరిహద్దుల్లో కలిగి ఉంటుంది. అయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల విషయంలో తెలంగాణ మహారాష్ట్రకు మధ్య వివాదం కొనసాగుతోంది. బార్డర్ లోని 12 గ్రామాలు (పరందోళి, అంతాపూర్, ఎస్సాపూర్, కోట, పరస్వాడ, బోలాపటార్, పద్మావతి, ఇందిరా నగర్, మహారాజ్ గూడ, ముక్దంగూడ, లెండిజాల, గౌరి) తమవంటే తమవని ఇరురాష్ట్రాలు గొడవపడుతున్నాయి.
ఈ 12 గ్రామాల పంచాయతీ తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ తెరపైకి వచ్చింది. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలోకి ఈ గ్రామాలు వస్తాయి... ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ అధికారులు సిద్దమవుతున్నారు. మహారాష్ట్ర కూడా ఈ రెండు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇలా తెలంగాణ నుండి ఒకరు, మహారాష్ట్ర నుండి ఇంకొకరు అంటే ఒకే పంచాయతీకి ఇద్దరు సర్పంచ్ లు ఉంటారన్నమాట.
కేవలం సర్పంచ్ లే కాదు ఉపసర్పంచ్ లు కూడా ఇద్దరు ఉంటారు. అలాగే ఒక్కో వార్డుకి ఇద్దరు మెంబర్లు ఉంటారు. ఇలా మొత్తంగా పరందోళి, అంతాపూర్ గ్రామాల్లో పాలకులకు డబుల్ ధమాకా అన్నమాట... తెలంగాణలో కాకుంటే మహారాష్ట్ర నుండి సర్పంచ్ కావచ్చు… మహారాష్ట్ర కాకుంటే తెలంగాణ నుండి కావచ్చు. ఇలా ఒకే పంచాయతీకి ఇద్దరు సర్పంచులుండటం ఆశ్చర్యకరమే కాదు పాలనాపరంగా ఇబ్బందికరం కూడా. అందుకే ఈ రెండు పంచాయతీల విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర ఓ ఏకాభిప్రాయానికి రావాలని ప్రజలు కోరుతున్నారు.
పరందోళి, అంతాపూర్ గ్రామాలపై ఎందుకీ వివాదం?
పరందోళి, అంతాపూర్ పంచాయతీలు మొదట ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవే... కానీ 1987 లో వీటిని మహారాష్ట్ర ప్రభుత్వం తమ భూభాగంగా పేర్కొంది. దీంతో వివాదం మొదలయ్యింది... ఇరురాష్ట్రాల ఈ పంచాయతీల పరిధిలోని గ్రామాలు తమవంటే తమవని అంటున్నాయి. కేంద్రం కలగజేసుకుని ఈ గ్రామాలు తెలంగాణకు చెందినవిగా తేల్చింది... కానీ మహారాష్ట్ర వీటిని వదులుకోడానికి సిద్దంగా లేదు... సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ న్యాయపోరాటం చేస్తోంది. ఇప్పటికీ ఈ కేసు కొనసాగుతూనే ఉంది.
మరో రెండు వింత గ్రామ పంచాయతీలు
ములుగు జిల్లాలోని మహ్మద్ గౌస్ పల్లి, హన్మకొండ జిల్లాలోని కటాక్షపూర్ గ్రామపంచాయతీలే వేరువేరు. కానీ రెండు గ్రామాలు కలిసే ఉంటాయి... పక్కపక్క ఇళ్లే అయినా ఒకటి గౌస్ పల్లి, ఇంకోటి కటాక్షపూర్ పరిధిలోకి వస్తుంది. కొన్నిసార్లు ఓ పంచాయతీ ఓటర్లు మరో పంచాయతీలోకి చేరతారు. తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఈ రెండు గ్రామ పంచాయితీల్లోని ఓటర్లలో కన్ఫ్యూజన్ మొదలయ్యింది... తమ ఓటు ఎక్కడుందోనని.
జిల్లాలు వేరు, పంచాయితీలు వేరు... కానీ గ్రామస్థులు మాత్రం ఒక్కటే. ఇలా జిల్లాల సరిహద్దులోని గౌస్ పల్లి, కటాక్షపూర్ పంచాయతీ ఎన్నికల వేళ వార్తల్లో నిలిచాయి. అధికారులు వెంటనే స్పందించి ఏ పంచాయతీ పరిధిలో ఓటేయాలో క్లారిటీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

