Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Rising Global Summit 2025 : వందలు వేలు కాదు ఏకంగా లక్షకోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ కు వస్తోంది ట్రంప్ మీడియా ఆండ్ టెక్నాలజీ గ్రూప్. దీంతో ఫ్యూచర్ సిటీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

హైదరాబాద్ పై ట్రంప్ కన్ను
Telangana Rising Global Summit 2025 : ప్రపంచంలోనే పవర్ ఫుల్ దేశం అమెరికా... ఆర్థికంగా, పారిశ్రామికంగా ఈ దేశం భారత్ కంటే చాలా ముందుంది. ఇలాంది దేశానికి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపు మళ్లింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే 'ఫ్యూచర్ సిటీ' లో భారీ పెట్టుబడులు పెట్టెందుకు ట్రంప్ కంపెనీ సిద్దమయ్యింది. ఈ నిర్ణయం హైదరాబాద్ ను మరోస్థాయికి తీసుకెళ్లగలదని పాలకులే కాదు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యూచర్ సిటీలో ట్రంప్ పెట్టుబడులు
హైదరాబాద్ శివారులో మరో సిటీని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. "భారత్ ఫ్యూచర్ సిటీ'' పేరిట నిర్మించనున్న ఈ నగరంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానిస్తోంది... ఇందుకోసం ''తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'' నిర్వహిస్తోంది. రెండ్రోజులు (డిసెంబర్ 8-9 తేదీల్లో) నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ట్రంప్ మీడియా ఆండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ కూడా పాల్గొన్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగించిన ఎరిక్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ట్రంప్ కంపెనీ ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందని వెల్లడించారు. రాబోయే పదేళ్లలో ఫ్యూచర్ సిటీతో అభివృద్ధితో పాటే తమ పెట్టుబడులు కొనసాగుతాయని... వివిధ రంగాల్లో ఈ డబ్బులు వినియోగిస్తామని తెలిపారు. TMTG ప్రకటన ఫ్యూచర్ సిటీపై అంచనాలను మరింత పెంచింది... రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింత ఊతమివ్వనుంది.
ట్రంప్ కంపెనీ నేపథ్యం
ట్రంప్ మీడియా ఆండ్ టెక్నాలజీస్ గ్రూప్ కార్పోరేషన్ (TMTG) అనేది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఏర్పాటుచేసిన సంస్థ... 2021, ఫిబ్రవరి 8న ప్రారంభించారు. ప్లోరిడాలోని సరపోటాలో ప్రధాన కార్యాలయం ఉంది... ''ట్రూత్ సోషల్'' అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. డొనాల్డ్ జె ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్ యాజమాన్యంలో ఈ కంపెనీ నడుస్తోంది.
ఏమిటీ ఫ్యూచర్ సిటీ
ఒకప్పుడు హైదరాబాద్ అంటే జంటనగరాలు... హైదరాబాద్, సికింద్రాబాద్. ఐటీ డెవలప్మెంట్ తర్వాత నగరంలో మరో సిటీ పుట్టుకువచ్చింది.. అదే సైబరాబాద్. ఇప్పుడు రేవంత్ సర్కార్ భవిష్యత్ అవసరాలకోసం నాలుగో సిటీని నిర్మించడానికి సిద్దమయ్యింది... అదే 'ఫ్యూచర్ సిటీ'.
హైదరాబాద్ శివారులోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల వెంట కొత్త నగరాన్ని డెవలప్ చేస్తోంది ప్రభుత్వం. మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునికి సదుపాయాలు, కళ్లుచెదిరే డెవలప్మెంట్ తో సిటీని నిర్మించాలని భావిస్తోంది. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఫ్యూచర్ సిటీలోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది.
ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గ్రూప్ తో పాటు అనేక సంస్థలు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇలా ఏఏ రంగాల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చూద్దాం.
డీప్ టెక్నాలజీ – ₹75,000 కోట్లు
గ్రీన్ ఎనర్జీ – ₹27,000 కోట్లు
పునరుత్పాదక శక్తి – ₹39,700 కోట్లు
ఏరోస్పేస్, డిఫెన్స్ – ₹19,350 కోట్లు
ఏవియేషన్ (GMR గ్రూప్) – ₹15,000 కోట్లు
మాన్యుఫ్యాక్చరింగ్ – ₹13,500 కోట్లు
స్టీల్ ఇండస్ట్రీ – ₹7,000 కోట్లు
టెక్స్‌టైల్ రంగం – ₹4,000 కోట్లు
ఇలా ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తడం, ప్రభుత్వ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరందుకుంది... రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరో కోకాపేట్ అయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం.

