- Home
- Telangana
- Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising Global Summit 2025 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజే రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి కొత్త మార్గాలు తెరిచాయి. వేల ఉద్యోగాలు రానున్నాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ : టెక్ నుంచి టెక్స్‌టైల్ వరకు.. తెలంగాణకు వరదలా పెట్టుబడులు!
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజే రాష్ట్రానికి అద్భుత విజయాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వాధికారులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో సదస్సు మరింత సందడిగా మారింది.
తొలి రోజునే రూ.1.88 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు (MOU) కుదిరాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడులు అత్యాధునిక రంగాలపై రాష్ట్రం చూపుతున్న దృష్టికి నిదర్శనం. వేల ఉద్యోగాలు రానున్నాయి.
Telangana Rising Global Summit : కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చినవి డీప్ టెక్నాలజీ రంగంలోనే.
- డీప్ టెక్నాలజీ – ₹75,000 కోట్లు
- గ్రీన్ ఎనర్జీ – ₹27,000 కోట్లు
- పునరుత్పాదక శక్తి – ₹39,700 కోట్లు
- ఏరోస్పేస్, డిఫెన్స్ – ₹19,350 కోట్లు
- ఏవియేషన్ (GMR గ్రూప్) – ₹15,000 కోట్లు
- మాన్యుఫ్యాక్చరింగ్ – ₹13,500 కోట్లు
- స్టీల్ ఇండస్ట్రీ – ₹7,000 కోట్లు
- టెక్స్‌టైల్ రంగం – ₹4,000 కోట్లు
ఒకే రోజు ఇంత భారీగా పెట్టుబడులు రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది.
Telangana Rising Global Summit : ఆసియా దేశాలతో కీలక ఒప్పందాలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన ప్రకారం ఆసియా దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వాటిలో
AGIDC – ₹70,000 కోట్లు
సింగపూర్‌కు చెందిన ఈ సంస్థ తెలంగాణలో AI ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
Vin Group – ₹27,000 కోట్లు
వియత్నాంకు చెందిన విన్ గ్రూప్ సోలార్ ప్లాంట్లు, EV తయారీ, ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది. సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరగడం ఈ సమ్మిట్‌కు గ్లోబల్ ప్రాముఖ్యతను ఇచ్చింది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి స్వయంగా నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
CURE PURE RARE : తెలంగాణ అభివృద్ధికి కొత్త రోడ్‌మ్యాప్
సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను పరిచయం చేశారు. దీనిలో రాష్ట్ర అభివృద్ధిని మూడు ప్రధాన జోన్‌లుగా విభజించారు.
- CURE – Core Urban Region Economy : ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని టెక్, వ్యాపారాలకు గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యం.
- PURE – Peri Urban Region Economy : ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాలు లాజిస్టిక్స్, నగర శివారు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి.
- RARE – Rural Agricultural Region Economy : వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం.
ఈ విభజన రూపకల్పనలో ఐఎస్బీ, నీతియాయోగ్ నిపుణుల సూచనలు కూడా తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణకు నూతన దిశ.. చైనా గ్వాంగ్‌డాంగ్ మోడల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “20 ఏళ్లుగా చైనాలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాష్ట్రానికి ఆదర్శం” అని పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి గ్లోబల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రెండు రోజుల సమ్మిట్‌కు నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, ఆసియా దేశాలతో కీలక ఒప్పందాలు కుదరడం, 2047 విజన్‌కు స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయడం.. ఇవన్నీ తెలంగాణను కొత్త పరిశ్రమల గమ్యస్థానంగా మార్చనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

