- Home
- Andhra Pradesh
- IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
High Pressure System : ప్రస్తుతం కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోతున్నాయి… చలి గజగజా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో గడ్డకట్టే చలి
Weather Update : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... రోజురోజుకు టెంపరేచర్స్ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తుంటే కొంపదీసి మైనస్ డిగ్రీస్ టెంపరేచర్స్ నమోదవుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా చలిగాలుల తీవ్రత ఊహించని స్థాయిలో ఉండటానికి అధికపీడనమే కారణంగా తెలుస్తోంది.
ఉత్తరభారతం నుండి చలిగాలులు
ప్రస్తుతం వాయువ్య భారతదేశం నుండి మధ్యభారతం వరకు అధికపీడనం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది నుండి దక్షిణభారతదేశం వైపు వీచే గాలులు చల్లగా ఉంటున్నాయని... అందుకే ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నట్లు వెల్లడించారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణతో పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ ఉత్తరాది చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఏమిటీ అధికపీడనం?
సాధారణంగా అల్పపీడనం అనే పదం మనం ఎక్కువగా వింటుంటాం. అధికపీడనం అనే పదం మాత్రం ఎప్పుడోగాని వినిపించదు. ప్రస్తుతం అధికపీడనం కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణంగా వాతావరణ పీడనం కంటే గాలి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బరువైన చల్లని గాలి భూమిపైకి దిగుతుంది. దీంతో పొడి వాతావరణం ఏర్పడిన చలితీవ్రత పెరుగుతుంది. ఇలాంటి చలి వాతావరణం ఉత్తరాదిన ఏర్పడింది… అక్కడి నుండి చల్లనిగాలులు దక్షిణాది వైపు వీస్తున్నాయి.
ఏపీతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అరకులోయలో అత్యల్పంగా 3.6 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఇక డుంబ్రిగూడలో 3.9, కిలగాడలో 4.6, పాడేరులో 4.8, పెదబయలులో 6.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు ఇవే అత్యల్ప ఉష్ణోగ్రతలు... అయితే టెంపరేచర్స్ మరింతగా తగ్గే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తెలంగాణపై చలిపంజా
తెలంగాణలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 6.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ లో 6.8, వికారాబాద్ లో 7.8, కామారెడ్డిలో 8.2, నిజామాబాద్ లో 8.4, మెదక్ లో 8.4, రంగారెడ్డిలో 8.4, సిద్దిపేటలో 8.9, నిర్మల్ లో 9, సిరిసిల్లలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్ లో కూడా అత్యల్పంగా HCU పరిసరాల్లో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

