బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న భారీ వర్షాల గండం
IMD Rain Alert : తెలుగు ప్రజలకు మరోసాారి వర్ష భయం మొదలయ్యింది. వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతుండటంతో ఈసారి ఏస్థాయిలో వర్షాలుంటాయోనని ఆందోళన మొదలయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
IMD Rain Alert : వర్షకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యింది... అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. ఇప్పటివరకు అక్టోబర్ లో సాధారణ వర్షాలే కురిశాయి... కానీ ఇకపై ఆగస్ట్, సెప్టెంబర్ స్థాయిలో కుండపోత వర్షాలు కురుస్తాయా అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. ఎందుకంటే త్వరలోనే బంగాళాఖాతంలో పరిస్ధితులు పూర్తిగా మారిపోయి వర్షాలకు అనుకూలంగా మారతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో మరోసారి భారీ వర్షాలు తప్పేలాలేవు.
బంగాళాఖాతంలో వాయుగుండం
ఈ నెల (అక్టోబర్) 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని... అక్టోబర్ 26 నాటికి ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని ... ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేస్తోంది.
ఏపీలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడాయి... ఈశాన్య రుతుపవనాల ఎంటర్ అయ్యాయి. వీటి ప్రభావంతో శనివారం (అక్టోబర్ 18) నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.
ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలివే..
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కూడా నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
నేడు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు (అక్టోబర్ 18, శనివారం) వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
రేపు (అక్టోబర్ 19, ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ , వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట , జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఇక శీతాకాలం విషయాలని వస్తే తెలంగాణ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో ఉష్ఱోగ్రతలు పడిపోతున్నాయి. హయత్ నగర్ లో 19, పటాన్ చెరు ఈక్రిశాట్ లో 19.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద 21.4, రాజేంద్రనగర్ లో 21, హకీంపేటలో 21.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ లో 18.8 డిగ్రీ సెల్సియస్... మిగతా జిల్లాల్లో 20 నుండి 25 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి.