IMD Rain Alert : అరేబియాలో ఒకటి, బంగాళాఖాతంలో మరోటి.. రెండు వాయుగుండాలతో ఇక అతలాకుతలమే
IMD Rain Alert : వర్షాకాలం ముగిసింది.. ఇక వానలుండవని భావిస్తున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాాఖ షాకిచ్చింది. ఒకటి కాదు ఏకంగా రెండు వాయుగుండాల గండం పొంచివుందని హెచ్చరిస్తోంది.

ముంచుకొస్తున్న వర్షాలు
IMD Rain Alert : నైరుతి రుతుపవనాలు దేశంనుండి పూర్తిగా నిష్క్రమించాయి... అంటే వర్షాకాలం అఫిషియల్ గా ముగిసినట్లే. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు దేశంలో విస్తరిస్తున్నాయి... వీటివల్ల చలిగాలుల తీవ్రత పెరుగుతుంది గానీ పెద్దగా వర్షాలుండవు. అయితే ప్రస్తుతం అరేబియా సముద్రంలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది... కొద్దిరోజుల్లో బంగాళాఖాతంలో కూడా ఇలాంటి వాతావరమే ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఈ అక్టోబర్ సెకండాఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... మరోసారి అల్లకల్లోలం తప్పదని భారత వాతావరణ శాఖ ముందుగానే కీీలక ప్రకటన చేసింది.
అరేబియా సముద్రంలో వాయుగుండం
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఇది రేపటికి (అక్టోబర్ 18, శనివారం) అల్పపీడనంగా మారుతుందని IMD తెలిపింది. ఇది ముందుకు సాగుతూ మరింత బలపడి వచ్చే సోమవారం (అక్టోబర్ 20) కి వాయుగుండంగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని… భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తెలుగు ప్రజలను ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి.
దీపావళి రోజే వాయుగుండమా..!
ప్రస్తుతం అక్కడక్కడ చెదుమదురు జల్లులు మినహా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు… పొడి వాతావరణం ఉంటోంది. దీంతో దీపావళి పండగ సమయంలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని భావిస్తున్న ప్రజలు పండగను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఈ వాయుగుండం హెచ్చరికలు ప్రజల పండగ ఆశలపై నీళ్లుజల్లేలా కనిపిస్తున్నాయి. సరిగ్గా దీపావళి రోజే వాయుగుండం ఏర్పడుతుందని ఐఎండి హెచ్చరిస్తోంది... అంటే పండగపూట వర్షాలు తప్పవవన్నమాట.
బంగాళాఖాతంలో మరో వాయుగుండం
ఇంతటితో వర్షాలు కథ ముగియలేదు... ముందుంది ముసళ్ల పండగ. అరేబియా సముద్రంలో ఏర్పడే వాయుగుండం అలా బలహీనపడుతుందో లేదో ఇలా బంగాళాఖాతంలో మరో వాయుగుండం రెడీగా ఉంటుందని... దీంతొ వచ్చేవారం నాన్ స్టాప్ వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది. ఒక్క వాయుగుండమే వాతావరణాన్ని పూర్తిగా మార్చేసి అతలాకుతలం చేస్తుంది... అలాంటిది ఒకేవారంలో రెండు ఏర్పడుతున్నాయి.. దీంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో కంగారు మొదలయ్యింది.
తస్మాత్ జాగ్రత్త
అక్టోబర్ 24న అంటే వచ్చే శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని... అక్టోబర్ 26న (ఆదివారం) ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాలన్నింటా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.
ఇకపైనా వర్షబీభత్సమేనా...
ఇప్పటికే వర్షాకాలం తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. గత రెండునెలలు (ఆగస్ట్, సెప్టెంబర్) అయితే కుండపోత వర్షాలతో పలుమార్లు వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏస్థాయిలో వరదలు సంభవించాయో చూశాం... ఇక హైదరాబాద్ లో మూసీ పరవళ్లు తొక్కుతూ నగర ప్రజలపై విరుచుకుపడటం చూశాం. తెలుగు రాష్ట్రాల్లోని జీవనదులు కృష్ణా, గోదావరి ఉగ్రరూపం... వరదనీటితో ఇతర నదులు, వాగులువంకల ఉద్ధృతి... జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారడం...వర్షాకాలంలో ఏమేం జరగాలో అన్నీ జరిగాయి. ఇప్పుడు వర్షాకాలం ముగిసింది... ఇక ఇవేమీ ఉండవనుకుంటున్న సమయంలో మళ్లీ అల్పపీడనాలు, వాయుగుండాలు అంటూ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెబుతోంది.