తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న పిడుగుల ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి, సేఫ్ గా ఉండండి
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది… ఈ క్రమంలో సేఫ్ గా ఉండాలంటే తెెలుగు ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే.

తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త...
Thunderstorm Alert : వర్షాకాలం ముగిసింది... అయినా తెలుగు రాష్ట్రాలను వానలు వదిలిపెట్టడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా వర్షాలు, వరదలతోనే సతమతం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు పిడుగుల ప్రమాదం వెంటాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మరికొన్నిరోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఇకపై కేవలం వర్షాలే కాదు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. అంటే ఇకపై భారీ వర్షాలతో కాదు పిడుగులతో ప్రమాదం పొంచివుంటుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందుజాగ్రత్త సూచనలు చేస్తోంది.
ఏపీకి పొంచివున్న పిడుగుల ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (సోమవారం) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ నాలుగైదు రోజులు వర్షాలే
తెలంగాణలో కూడా పిడుగులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ (సోమవారం) యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో పిడుగుతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. కేవలం ఈ ఒక్కరోజే కాదు రాబోయే నాలుగైదు రోజులు ఇలాగే వర్షాలుంటాయని హెచ్చరించారు.
నవంబర్ 7వరకు వర్షాలే
నవంబర్ 7 అంటే వచ్చే శుక్రవారం వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. అంటే అప్పటివరకు ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాల ప్రమాదం పొంచివుందన్నమాటే… ఈ నాలుగైదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఇలా పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
Hyderabad people be like
November ochina kuda maaku ee 🌧️ tho enti ee karma 🤦
Don't worry
Last day of rainy season is November 7
Thereafter POWERFUL WINTERS will grip entire Telangana including Hyderabad with TOTAL DRY WEATHER with CLEAR SKIES 🥶— Telangana Weatherman (@balaji25_t) November 2, 2025
పిడుగుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. చెట్ల కింద ఉండరాదు :
పిడుగులు ఎక్కువగా ఎత్తైన చెట్లపై పడుతుంటాయి. మరీముఖ్యంగా తాటిచెట్లపై పిడుగులు పడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్లకింద అస్సలు ఉండరాదు.
2. ప్రయాణాల్లో ఉండేవారికి జాగ్రత్తలు :
వర్ష సమయంలో బైక్ పై వెళ్లేవారు తడవకుండా ఉండేందుకు చెట్లకిందకు వెళుతుంటారు.. ఇలా అస్సలు చేయరాదు. ఇతర సురక్షిత ప్రాంతాలను ఎంచుకోవాలి. ఇక కారు, ఇతర ఫోర్ వీలర్స్ లో ప్రయాణించేవారు వర్షం కురిసే సమయంలో చెట్లతో నిండివున్న మార్గాల్లో ప్రయాణించడం సేఫ్ కాదు. అలాంటప్పుడు చెట్లులేని ప్రదేశాన్ని ఎంచుకుని వాహనాన్ని నిలుపుకోవాలి.
3. కొండలు, ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండండి
చదునైన మైదానప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం తక్కువ. ఎతై కొండలు, పర్వత ప్రాంతాల్లో పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. కాబట్టి వర్ష సమయంలో ఇలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అక్కడే ఉండాల్సివస్తే సురక్షిత ప్రాంతాలను ఎంచుకొండి.
4. బయటకు రావద్దు
వర్షం కురిసే సమయంలో బయటకు రాకపోవడమే మంచిది. ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార స్థలాలు, స్కూళ్లు, కాలేజీలు... ఎక్కడివారు అక్కడే ఉండాలి. అత్యవసరం అయితేతప్ప వర్ష సమయంలో బయటకు రావద్దు.
5. విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండండి
పిడుగు అనేది ఓ విద్యుత్ ప్రవాహం... కాబట్టి ఇది విద్యుత్ పరికరాలచే ఆకర్షింపబడుతుంది. అందువల్లే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు వంటివాటికి వర్ష సమయంలో దూరంగా ఉండాలి. సెల్ ఫోన్లు, టివి వంటి విద్యుత్ పరికరాలను కూడా వాడకూడదు. పిడుగుల కారణంగా వీటిలో విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు జరిగి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
దగ్గర్లో పిడుగుపడితే ఏం చేయాలి?
6. రైతులు, కూలీలు జాగ్రత్త
వ్యవసాయపనులు చేసే రైతులు, కూలీలు వర్ష సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్ష సమయంలో పొలాలవద్ద ఉండే నిర్మాణాల్లో మాత్రమే తలదాచుకోవాలి... చెట్లకింద అస్సలు ఉండరాదు.
7. వాతావరణ సూచనలు తెలుసుకొండి
శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి వాతావరణ పరిస్థితులను అంచనావేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. కాబట్టి పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను ముందే హెచ్చరిస్తుంది.. అలాంటప్పుడు ఆయా ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలి.
8. పాడిపశువులు జాగ్రత్త
పాడి పశువులు, ఇతర పెంపుడు జంతువులను వీలైనంతవరకు చెట్లకు దూరంగా ఉంచండి. వాటికోసం రేకుల షెడ్డు కంటే కట్టెలు, గడ్డితో కూడిన షెల్టర్ నిర్మించండి. లోహపు వస్తువులు పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
9. దగ్గర్లో పిడుగు పడితే ఏం చేయాలి?
పెద్దగా ఉరుముల లబ్దం, ప్రకాశవంతమైన మెరుపు కనిపిస్తే భయపడి వెంటనే నేలపై పడుకోవడం చేయరాదు. కిందకూర్చుని మోకాళ్ల మధ్యతో తలపెట్టి, చేతులను చెవులపై ఉంచుకుని కళ్లు మూసుకోవాలి. దీనివల్ల తల భాగం సురక్షితంగా ఉంటుంది… కళ్లు, చెవులు వంటి సున్నితమైన అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి.
10. ఇంట్లో ఉండేవారు ఏం చేయాలి?
ఇంట్లో ఉండేవారు కూడా జాగ్రత్తలు పాటించారు. వర్ష సమయంలో ముఖ్యంగా కిటికీలు, తలపులు మూసేసుకోవాలి. టీవీలు, ప్రిజ్ వంటివాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.. వీలైతే ఇంటి మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. వర్షం ముగిసేవరకు ఇళ్లలో ఉండేవారు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి.