ఆకాశంలో అల్లకల్లోలం.. తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
IMD Rain Alert: తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయంటే..

మళ్లీ వర్షాల సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.
అల్పపీడనం ఏర్పడే అవకాశాలు
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, విదర్భ – మరఠ్వాడ ప్రాంతాల్లో సుమారు 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాల రూపంలో కనిపిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ నెల 4వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఏ జిల్లాల్లో భారీ వర్షాలు?
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రాత్రి యాదాద్రి–భువనగిరి, రంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రాత్రివేళల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని చెప్పారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గాలుల దిశ, వేగం
రాష్ట్రం అంతటా ఉత్తర దిశ నుంచి గంటకు 6–10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతంగా ఉండి, ఎప్పటికప్పుడు తేలికపాటి జల్లులు కురిసే పరిస్థితి కనిపించవచ్చని సూచించింది.
హైదరాబాద్‌లో ఎలా ఉండనుందంటే.?
హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరు, లింగంపల్లి, గాజులరామారం, నిజాంపేట్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, శేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం (ఈరోజు) రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.