- Home
- Telangana
- Cold Wave Alert: తెలంగాణపై చలి పంజా.. ఉన్నట్టుండి రాత్రి ఉష్ణోగ్రతలు డౌన్... వింటర్ కేర్ టిప్స్ ఇవే
Cold Wave Alert: తెలంగాణపై చలి పంజా.. ఉన్నట్టుండి రాత్రి ఉష్ణోగ్రతలు డౌన్... వింటర్ కేర్ టిప్స్ ఇవే
Cold Wave Alert: తెలంగాణ పై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన ఈ మార్పులతో ఆరోగ్యం కాపాడుకోవడానికి, ఈ వింటర్ సీజన్ లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

చలి పంజా విసురుతోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నవంబర్ నెల ప్రారంభం కావడంతోనే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారుతోంది. మొన్నటివరకు వరుస తుపానులు, వర్షాలు, పలు ప్రాంతాల్లో ఎండలతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు చలితీవ్రతతో వణుకుతోంది. ఈశాన్య దిశ నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వాతావరణం పూర్తిగా కూల్ గా మారిపోయింది. రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఉదయం, రాత్రి గాలులతో అప్రమత్తం
రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు వేగంగా క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో వీస్తున్న చల్లని గాలులకు జనం ఇళ్లలోనే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాయంత్రం 5:30 దాటిందంటే చాలు వాతావరణంలో చల్లదనం పెరిగిపోతోంది. రాబోయే కొద్ది రోజులు పొడి గాలుల ప్రభావం వల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశముంది. వీటితో జాగ్రత్తగా వుండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న చలి.. శివార్లలో పొగమంచు అలర్ట్
రాజధాని హైదరాబాద్ నగరంలో నైట్ టెంపరేచర్స్ 17 డిగ్రీల సెల్సియస్ నుంచి 19 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలముకుంటోంది. ఉదయం 8 గంటల వరకు చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితులు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఉత్తర తెలంగాణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వణుకు
ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డిలలో చలి పంజా విసురుతోంది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుంచి 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలి తీవ్రత మరింత పెరగనుంది.
పొడి వాతావరణం.. మళ్లీ వర్షాలకు ఛాన్స్
గత వారం రోజుల వరకు కురిసిన వర్షాలు ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల రాష్ట్రంలో ఎక్కడా వర్ష సూచన లేదని, రాబోయే రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు తగ్గినప్పటికీ, చలి ప్రభావం పెరగడంతో ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
వింటర్ హెల్త్ టిప్స్: శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
మారిన వాతావరణంలో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
వెచ్చని వస్త్రాలు: తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, మఫ్లర్లు, క్యాప్‌లు తప్పనిసరిగా వాడాలి.
గోరువెచ్చని నీరు: శీతాకాలంలో దాహం తక్కువగా వేసినప్పటికీ, శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి తగినంత గోరువెచ్చని నీటిని తాగాలి.
ఇమ్యూనిటీ ఫుడ్: విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఉసిరి, తాజా పండ్లు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చర్మ సంరక్షణ: చలిగాలులకు చర్మం పొడిబారకుండా ఉండటానికి మయిశ్చరైజర్లు లేదా కొబ్బరినూనె రాయాలి.
మాస్క్ వాడకం: పొగమంచు ఉన్న వేళల్లో ఉదయాన్నే వాకింగ్ చేసేవారు మాస్క్ ధరించడం ద్వారా డస్ట్ అలర్జీలు, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.













