తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి.. ఆ జిల్లాపై ప్రత్యే దృష్టి
Telangana: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు వెల్లడించారు.

సింగరేణి భవన్లో అమెరికా ప్రతినిధుల సమావేశం
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో శుక్రవారం అమెరికా కాన్సులేట్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో సమావేశమైంది. హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ పొలిటికల్ అండ్ ఎకనమిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. పొలిటికల్ అండ్ ఎకనమిక్ స్పెషలిస్టులు శ్రీమలి కరి, శిబా త్రిపాఠితో పాటు కమర్షియల్ స్పెషలిస్ట్ సునేల్ కుమ్మర్ సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణి తరఫున సీఎండీతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఇంధన రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కీలక ఖనిజాల అన్వేషణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
డేటా సెంటర్లకు సింగరేణి ప్రాంతాలపై ఆసక్తి
ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతుండటంతో భారీ స్థాయిలో డేటాను నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం కోసం డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. వీటి నిర్వహణకు నిరంతరాయంగా భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను అమెరికా ప్రతినిధులు అన్వేషిస్తున్నారు. తెలంగాణలోని సింగరేణి ప్రాంతాలు కూడా ఇందుకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ లభ్యత, భవిష్యత్తులో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించి ఈ దిశగా ముందుకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేశారు.
మూతపడిన గనులతో విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక
సింగరేణి పరిధిలో వినియోగం ముగిసిన ఓపెన్ కాస్ట్ గనులను ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా అవసరమైన సమయాల్లో విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉండే పీక్ అవర్స్‌లో డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న గనుల ప్రాంతాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ఇంధన రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ఈ ప్రణాళికల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
కీలక ఖనిజాల అన్వేషణలో అమెరికాతో భాగస్వామ్యం
బొగ్గు తవ్వకాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పుడు కీలక ఖనిజాల రంగంలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన సంస్థలతో సాంకేతిక సహకారం, ఉమ్మడి పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరుపుతోంది. అమెరికాలోని కీలక ఖనిజ రంగ సంస్థలతో కలిసి పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని అమెరికా ప్రతినిధులు తెలిపారు. కొత్తగూడెంలో సింగరేణి ఏర్పాటు చేసిన జియో సైన్స్ లేబొరేటరీలోని పరిశోధన సదుపాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఓపెన్ కాస్ట్ గనుల్లో తవ్వకాల సమయంలో వెలికితీసే ఓవర్బర్డెన్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (అరుదైన భూ మూలకాలు) ఉండే అవకాశాలపై ఆసక్తి కనబరిచారు.
అమెరికాలో జరిగే కీలక ఖనిజ సదస్సుకు ఆహ్వానం
కీలక ఖనిజాల రంగంలో పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు పక్షాలు ఆసక్తి చూపించాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించనున్న కీలక ఖనిజాల సదస్సుకు సింగరేణి సంస్థను అమెరికా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ సంస్థలతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పెట్టుబడులు, ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన అవకాశాలను పరిశీలించవచ్చు. ఈ పరిణామాలు కార్యరూపం దాలిస్తే తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, కీలక ఖనిజాల అన్వేషణకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.













