Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు
Weather Update: నవంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు పడనున్నాయనీ, ఇదే సమయోం చలి తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారుతోంది. మరోసారి వర్ష ముప్పు ముంచుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్, అమరావతి కేంద్రాలు వెల్లడించిన సమాచారం ప్రకారం నవంబర్ 13న బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటంతో పాటు, దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాగల కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వాతావరణం మారనుంది. వర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, యానాంలలో వర్షాల అలర్ట్
బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వాతావరణం ముసురుగా మారనుంది. ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ పరిధిలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆకాశం రోజంతా మేఘావృతమై ఉండి, పలచని చినుకులు పడవచ్చు. మరోవైపు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మాత్రం ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. అయితే అరకు, లంబసింగి వంటి మన్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. లంబసింగిలో 12°C కంటే తక్కువగా రికార్డు అవుతుండటంతో పర్యాటకుల సందడి పెరిగింది.
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణ విషయానికి వస్తే, ఇక్కడ ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి పొడి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే వీలున్నప్పటికీ, తర్వాతి రోజుల్లో క్రమంగా వర్షాలు తగ్గి పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల కంటే ఎక్కువగా ఇప్పుడు తెలంగాణపై చలి పంజా విసురుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14°C నుంచి 16°C వరకు నమోదవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ వాతావరణ ఎలా వుండనుంది?
రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా చలి పంజాతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు 29°C నుంచి 31°C మధ్య మాత్రమే ఉంటాయి. కానీ రాత్రి వేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17°C నుంచి 19°C వరకు పడిపోనున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. సాయంత్రం చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి.
ప్రజలకు అలర్ట్
వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పులు, పెరిగిన చలి వాతావరణం కారణంగా చిన్నారులు, వయోవృద్ధులు ఆరోగ్య విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున బయటకు వెళ్లేటప్పుడు వేడి దుస్తులు వాడడం మంచిది.
మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం వుంది కాబట్టి రైతులు అప్రమత్తమై కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవాలని అధికారులు సూచించారు.













