- Home
- Telangana
- Telangana: హైదరాబాద్‌లో గొర్రె, మేకల రక్తంతో అక్రమ వ్యాపారం.. ఇంతకీ రక్తంతో ఏం చేస్తున్నారంటే
Telangana: హైదరాబాద్‌లో గొర్రె, మేకల రక్తంతో అక్రమ వ్యాపారం.. ఇంతకీ రక్తంతో ఏం చేస్తున్నారంటే
Telangana: మారుతోన్న కాలంతో నేరాలు కూడా మారుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు రోజుకో కొత్త మార్తం ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణను కుదిపేసిన గొర్రె–మేకల రక్త అక్రమ వ్యాపారం
తెలంగాణలో బయటపడిన గొర్రె, మేకల రక్త అక్రమ దందా వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. బతికున్న మూగజీవాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రక్తం సేకరించి నిల్వ చేయడంపై కేంద్ర మాదక ద్రవ్యాల కంట్రోల్ విభాగం సీరియస్‌గా స్పందించింది. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ సంస్థలో భారీ స్థాయిలో రక్త నిల్వలు లభ్యమవ్వడం కలకలం రేపింది.
కాచిగూడలో దాడులు.. 1000 లీటర్ల రక్తం సీజ్
కేంద్ర మాదక ద్రవ్యాల కంట్రోల్ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర మాదక ద్రవ్యాల కంట్రోల్ అధికారులు సంయుక్తంగా CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు వెయ్యి లీటర్లకు పైగా గొర్రె, మేకల రక్తంతో నిండిన ప్యాకెట్లు బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో రక్తాన్ని నిల్వ చేయడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రక్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు సేకరించారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
పరారీలో ల్యాబ్ నిర్వాహకుడు..
ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న CNK సంస్థ నిర్వాహకుడు నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో కీసర ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల నుంచి గొర్రె, మేకల రక్తాన్ని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. నికేష్ దొరికితే ఈ అక్రమ దందా వెనుక పూర్తి నెట్‌వర్క్ బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మటన్ షాపు నుంచి ల్యాబ్ వరకు అక్రమ చైన్
కీసర మండలం నాగారం ప్రాంతంలోని ఓ మాంసం దుకాణంలో గొర్రె, మేకల రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్న ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడలోని ఒక ల్యాబ్ అని విచారణలో తేలింది. మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు అర్థరాత్రి ల్యాబ్‌పై దాడి చేసి ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన రక్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్, అతని సహాయకుడిపై కేసులు నమోదు చేశారు.
అసలీ రక్తంతో ఏం చేస్తారు.?
మెడికల్ రంగంలో గొర్రె రక్తానికి ప్రాధాన్యం ఉంది. మైక్రోబయాలజీలో జరిగే బ్లడ్ అగర్ పరీక్షల్లో షీప్ బ్లడ్ ఉపయోగిస్తారు. శరీరంలోకి వచ్చిన బాక్టీరియా ప్రభావాన్ని గుర్తించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అంతేకాదు, పాము కాటు చికిత్సలో ఉపయోగించే యాంటీవెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తం కీలకం. అయితే ఈ రక్త సేకరణ కఠినమైన బయోసేఫ్టీ నిబంధనల ప్రకారం జరగాలి. అనస్థీషియా లేకుండా రక్తం లాగడం మూగజీవాలకు ప్రాణాంతకంగా మారుతుంది. చల్లని ఉష్ణోగ్రతల్లో భద్రపరిచే విధానం, లేబులింగ్, రవాణా నియమాలు తప్పనిసరి. ఇవన్నీ ఉల్లంఘిస్తే అది నేరంగా పరిగణిస్తారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

