- Home
- Business
- Copper Price: ఇంట్లో రాగి ఉన్నోడు రారాజు.. అసలు కాపర్‌తో ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది.?
Copper Price: ఇంట్లో రాగి ఉన్నోడు రారాజు.. అసలు కాపర్‌తో ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది.?
Copper Price: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి రాగిపై పడింది. రానున్న రోజుల్లో రాగి ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాగి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి.? తెలుసుకుందాం.

ఏఐ యుగంలో రాగి ఎందుకు కీలక లోహంగా మారుతోంది?
ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ అంటే కేవలం సాఫ్ట్‌వేర్ కాదు. అది భారీ డేటా సెంటర్లు, సర్వర్లు, విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఏఐ పనిచేయాలంటే అపారమైన విద్యుత్ అవసరం. ఆ విద్యుత్ సరఫరా పూర్తిగా రాగి వైర్లపైనే ఆధారపడుతుంది. అందుకే నిపుణులు రాగిని ఏఐ యుగంలోని అత్యంత కీలక లోహంగా అభివర్ణిస్తున్నారు.
రాగి ధరలు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయి?
గోల్డ్‌మాన్ శాక్స్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రాగి డిమాండ్ భారీగా పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించాయి. 2026 జనవరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి ధర పౌండ్‌కు 5.74 డాలర్లకు చేరింది. భారత్‌లో స్పాట్ మార్కెట్ ధర కిలోకు రూ.1,156 స్థాయిలో ఉంది. 2025లో రాగి ధర టన్నుకు 12,000 డాలర్ల వరకు చేరింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు.
ఏఐ డేటా సెంటర్లు ఎందుకు రాగిని ఎక్కువగా వినియోగిస్తున్నాయి?
ఏఐ డేటా సెంటర్లు సాధారణ సర్వర్ల కంటే అనేక రెట్లు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి. ఎక్కువ సర్వర్లు అంటే ఎక్కువ వేడి. వేడి నియంత్రణ కోసం భారీ కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఇవన్నీ పనిచేయాలంటే భారీ స్థాయిలో విద్యుత్ సరఫరా కావాలి. విద్యుత్ ప్రసరణకు రాగి వైర్లు, గ్రిడ్లు తప్పనిసరి. అందుకే నిపుణులు “ఏఐ అంటే విద్యుత్, విద్యుత్ అంటే రాగి” అని స్పష్టం చేస్తున్నారు.
2026లో రాగి ధరలు తగ్గుతాయా?
నిపుణుల అంచనాల ప్రకారం 2026లో రాగి ధరలు ఒక్కసారిగా ఎగబాకకపోవచ్చు. 11,000 డాలర్ల పరిధిలో కొంత విరామం తీసుకునే అవకాశం ఉంది. ఇది ధర పతనం కాదు. మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుంటున్న దశ మాత్రమే. అసలు సమస్య సరఫరా వైపే ఉందని నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ పెరుగుతున్నా కొత్త గనులు వెంటనే అందుబాటులోకి రావడం లేదు.
సరఫరా ఎందుకు తక్కువగా ఉంది? భవిష్యత్‌లో ఏం జరగబోతోంది?
కొత్త రాగి గనులు అభివృద్ధి కావాలంటే 7 నుంచి 12 ఏళ్లు పడుతుంది. అనుమతులు, పర్యావరణ అనుమతులు, భూసేకరణ లాంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత నెమ్మదింపజేస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, విండ్ ఎనర్జీ, గ్రిడ్ అప్‌గ్రేడ్స్, బ్యాటరీ స్టోరేజ్, ఏఐ డేటా సెంటర్లు రాగి డిమాండ్‌ను పెంచుతున్నాయి. అమెరికా విద్యుత్ మౌలిక సదుపాయాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అందుకే రాగిని వ్యూహాత్మక లోహంగా పరిగణిస్తున్నారు.

