- Home
- Telangana
- Rain Alert: వానలే వానలు.. వచ్చే 5 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
Rain Alert: వానలే వానలు.. వచ్చే 5 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్
మొన్నటి వరకు ముఖం చాటేసిన వరణుడు ఇప్పుడు దంచికొడుతున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా వచ్చే 5 రోజులు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us

అల్పపీడనంతో భారీ వర్షాలు.
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండగా, మరోవైపు తూర్పు-పశ్చిమ ద్రోణి దక్షిణ కర్నాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాకా 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం భారీగా నమోదుకానుందని అధికారులు చెబుతున్నారు. జూలై 24న ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీనితో రాబోయే ఐదు రోజులు వర్షాలు మరింత ఉధృతం కావచ్చని అంచనా వేస్తున్నారు.
జిల్లాల వారీగా హెచ్చరికలు: ఆరెంజ్ అలర్ట్‌ల జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.
బుధవారం కూడా మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరకూ ఈ జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వానలు దంచికొట్టే సూచనలు ఉన్నాయి.
సీఎం రేవంత్ కీలక సూచనలు
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగం ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయాధికారులు, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణపై దృష్టి పెట్టాలని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో వర్షపాతం ఎలా ఉందంటే..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా ముల్కచర్లలో 10.7 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10 సెంటీమీటర్లు, వరంగల్‌లో మంగళవారిపేట 8.8 సెం.మీ., మహబూబాబాద్‌లో భూపతిపేట 7.4 సెం.మీ., రాజేంద్రనగర్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.. సోమవారం నర్సీపట్నంలో 114 మిల్లీమీటర్లు, మందసలో 88.75 మిల్లీమీటర్లు,
గొలుగొండలో 88.25 మిల్లీమీటర్లు, ఇనుమెల్ల (పల్నాడు)లో 80 మిల్లీమీటర్లు, గంధవరంలో (అనకాపల్లి) 78 మిల్లీమీటర్లు, పరవాడలో 71 మిల్లీమీటర్లు, టీ.నరసాపురంలో (ఏలూరు) 67.75 మిల్లీమీటర్లు కురిసింది.
24న మరో అల్పపీడనం
ఇదిలా ఉంటే ఈ నెల 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం రాష్ట్రంపై మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అల్పపీడనం తీవ్రంగా మారితే అది వాయుగుండంగా అభివృద్ధి చెందవచ్చని, తద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశాలు అధికమవుతాయని నిపుణుల అంచనా.
దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బలమైన గాలులు వీచుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.