- Home
- Telangana
- Telangana Politics : రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారా..? మంత్రుల భేటీవెనక అసలు సంగతేంటి..?
Telangana Politics : రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడుతున్నారా..? మంత్రుల భేటీవెనక అసలు సంగతేంటి..?
Telangana Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆయనపై కుట్రలు జరుగుతున్నాయని… అందులో భాగంగానే మంత్రుల భేటీ జరిగిందనే ప్రచారం సాగుతోంది. మరి సీనియర్ మినిస్టర్స్ మీటింగ్ అందుకే జరిగిందా, మరేదైనా కారణముందా..?

అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..?
Telangana Politics : తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా అంతకంటే హాట్ టాపిక్ మరోటి సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా సీనియర్ మంత్రులు భేటీకావడం సంచలనంగా మారింది. ఈ భేటీ సీఎం సీటు కోసమేనా..? రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెడుతున్నారా..? అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విదేశాల్లోని సీఎం ఉలిక్కిపడేలా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి.
మంత్రుల భేటీతో హీటెక్కిన పాలిటిక్స్
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. స్థానిక నాయకులు ఒకరిమాట ఒకరు వినే పరిస్థితి ఉండదు... అందుకే హైకమాండ్ కల్చర్ ఆ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ ను ప్రసన్నం చేసుకుని పదవిని పొందినవారే. లేదంటే ఆయనకు సీఎం పదవి కాదుకదా మంత్రి పదవి కూడా ఇచ్చేవారుకాదు స్థానిక కాంగ్రెస్ సీనియర్లు.
అయితే రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇవ్వడానికే వ్యతిరేకించినవారు సీఎంను చేస్తే ఊరుకుంటారా..? ఆయన వ్యతిరేకంగా హైకమాండ్ వద్ద లాబీయింగ్స్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇందులో ప్రధానపాత్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లది అనే ప్రచారం చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అలాంటిది సీఎం విదేశాల్లో ఉండగా ఈ ఇద్దరు మంత్రులు మరో ఇద్దరితో కలిసి భేటి కావడం రాజకీయ దుమారం రేపింది.
రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఒకే కారులో రాజ్ భవన్ నుండి కలిసివెళ్లిన ఈ నలుగురు ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. వీళ్లు ఏ అంశాలపై చర్చించారో క్లారిటీలేదు... కానీ విదేశాల్లో ఉన్న రేవంత్ కు వ్యతిరేకంగానే వీరిమధ్య మాటలు సాగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది.
మంత్రుల భేటీ ఇందుకోసమేనా..?
అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా మంత్రుల భేటీ సీఎంకు వ్యతిరేకంగానే జరిగిందా..? అంటే అందుకు తగిన ఆధారాలు లేవు. కానీ సీనియర్ మంత్రుల భేటీలో అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉండటంతో ఓ క్లారిటీ వస్తోంది... ఇది సీఎం సీటుకోసం కాదు మరేదో అంశం గురించి అని. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ భేటీ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల వివాదంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో వివాదం రాజుకుంది... ఆయనను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇది పార్టీకి నష్టం చేసే అవకాశాలుండటంతో ఏం చేయాలన్నది చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ఇంచార్జీగా ఉన్నారు. శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ మంత్రి... అడ్మూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా మంతరి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండటంతో జగిత్యాల అంశంపై చర్చించేందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సంబంధిత మంత్రులు భేటీ అయినట్లు తెలుస్తోంది.
అడ్లూరి లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చేశారా..?
పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకే మంత్రులు భేటీ అయ్యారని ఇప్పటికే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసుకునే వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి భేటీ గురించి వివరించినట్లు సమాచారం. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసిన మంత్రి జగిత్యాల అంశంపైనే చర్చించినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి గ్రూప్ రాజకీయాల్లో పాల్గొనడంలేదని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

