- Home
- Telangana
- Telangana : మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లో గెలుపెవరిది..?
Telangana : మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లో గెలుపెవరిది..?
Telangana Municipal Elections 2026 : మున్సిపల్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయా..? ఈ ఎన్నికల్లో అసలు ఏం జరగనుంది… కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మూడు పార్టీల్లో గెలుపు ఎవరిది..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026
Telangana Municipal Elections 2026 : తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే గ్రామ పంచాయితీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు పట్టణప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీలలో పాలకవర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ను విడుదలచేశారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది…
జనవరి 28 - నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
జనవరి 30 - నామినేషన్ స్వీకరణకు చివరితేదీ
జనవరి 31 - అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 3 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 11 - పోలింగ్
ఫిబ్రవరి 13 - ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి.
ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్... మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
త్రిముఖ పోరు ఉంటుందా..?
గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. బిజెపి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ పట్టణ ప్రజల పార్టీగా గుర్తింపుపొందిన బిజెపి మున్సిపాలిటీల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశాలున్నాయి. మూడు పార్టీలు వీలైనన్ని ఎక్కువ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను సాధించేందుకు విశ్వప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి.
ఈ ఎన్నికలు కాంగ్రెస్ కే కీలకం..
బిఆర్ఎస్, బిజెపిలు ప్రతిపక్షంలో ఉన్నాయి... కాబట్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ కాంగ్రెస్ కు అలాకాదు... అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా గెలిచితీరాలి. లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రజా వ్యతిరేకత బైటపడుతుంది. అందుకే కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రారంభించారు... టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జనంబాట పడుతున్నారు. దీన్నిబట్టే ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ఎంత కీలకమో అర్థమవుతోంది. దాదాపు 90 శాతం కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళుతోంది.
రేవంత్ సర్కార్ సాహసం చేస్తోందా..?
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేక ఉందని ప్రతిపక్షాలు బలంగా చెబుతున్నాయి. ఈ సమయంలో పంచాయితీ ఎన్నికలకు వెళ్లి తామేంటో నిరూపించుకుంది కాంగ్రెస్. అయితే సాధారణంగానే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది... కానీ అర్బన్ ఏరియాల్లోనే ఆ పార్టీ వీక్ అన్నది ప్రతిపక్షాలే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమయ్యింది.
కాబట్టి పంచాయితీ ఎన్నికలు సరేగానీ మున్సి.పల్ ఎన్నికల పలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ప్రజా వ్యతిరేకత ఉంటే ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ సాహసం చేస్తున్నట్లే..? ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ మంచి పలితాలు వస్తే ఆపార్టీ తిరుగుండదు.. ప్రతిపక్షాలకు కూడా గట్టిగా సమాధానం చెప్పవచ్చు. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.

