Telangana: కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా.? తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
Telangana: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడీ చర్య తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌కు సిట్ నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా సిట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని నోటీసులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ దర్యాప్తు విస్తరణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదట అధికారుల వరకే పరిమితమైన విచారణ ఇప్పుడు రాజకీయ నేతల దిశగా సాగుతోంది. కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలు ఎవరి సూచనలతో జరిగాయి అన్న అంశంపై సిట్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎంను కూడా విచారణ పరిధిలోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్‌ను విస్తృతంగా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 618 మంది ఫోన్లు ట్యాప్ చేశారన్న అంశం అప్పట్లోనే సంచలనం రేపింది. రాజకీయ నాయకులతో పాటు జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు కూడా టార్గెట్ అయ్యారన్న ఆరోపణలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది.
ప్రణీత్‌రావు అరెస్ట్ నుంచి కేసు మలుపు
2024 మార్చి 10న డీఎస్‌పీ ప్రణీత్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు నాశనం చేశారన్న ఫిర్యాదుతో సిట్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అదే నెలలో ప్రణీత్‌రావును అరెస్ట్ చేయడంతో ఈ కేసు తీవ్రత దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే తొలి అరెస్ట్.
మాజీ SIB చీఫ్ ప్రభాకర్‌రావు పాత్ర
ఈ వ్యవహారంలో మాజీ SIB చీఫ్ టి. ప్రభాకర్‌రావును కీలక వ్యక్తిగా సిట్ గుర్తించింది. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ జరిగిందన్న అంశంపై ఆయనను కేంద్రంగా చేసుకుని విచారణ సాగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆధారాలు, పాస్‌వర్డ్స్ సిట్‌కు అప్పగించాల్సి వచ్చింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రభాకర్‌రావును విడతల వారీగా ప్రశ్నించారు.
కేటీఆర్, హరీష్‌రావు విచారణ తర్వాత కేసీఆర్ టర్న్
సిట్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావు విచారణకు హాజరై కీలక విషయాలు వెల్లడించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్రపై ప్రశ్నలు వచ్చాయని ఆయనే వెల్లడించారు. అనంతరం జనవరి 20న మాజీ మంత్రి హరీష్‌రావును, 23న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గంటల తరబడి విచారించారు. ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు కేసీఆర్‌ను కూడా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమవడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.

