గ్రూప్-2 రద్దు : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Group 2 Exam: 2015 గ్రూప్ 2 పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేసింది. టీజీపీఎస్సీని 8 వారాల్లో కొత్త తుది జాబితా విడుదల చేయాలని ఆదేశించింది.

2015 గ్రూప్ 2 పరీక్షపై హైకోర్టు కీలక నిర్ణయం
2015లో విడుదలైన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఆ సంవత్సరం జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్‌పై నమోదైన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. టీజీపీఎస్సీ (టీఎస్ పీఎస్సీ) జారీ చేసిన 2019 సెలక్షన్ లిస్ట్‌ను పూర్తిగా రద్దు చేసింది. పరీక్ష ప్రక్రియలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని, అవి ఎంపికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
టీజీపీఎస్సీ రూపొందించిన ఎంపిక జాబితా సక్రమంగా లేదని పేర్కొంటూ, అందులో ఉపయోగించిన ఓఎమ్‌ఆర్ షీట్లను మళ్లీ రీవాల్యూయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అన్ని షీట్లను పునఃసమీక్షించిన తర్వాత కొత్త సెలక్షన్ లిస్ట్‌ను సిద్ధం చేసి ప్రకటించాలని న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
టీజీపీఎస్సీపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణలు
తీర్పు సమయంలో హైకోర్టు టీజీపీఎస్సీ వ్యవహార శైలిపై కూడా తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను సంస్థ ఉల్లంఘించడమే కాక, తన పరిధిని అధిగమించిన చర్యలు తీసుకుందని వ్యాఖ్యానించింది. ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.
కొత్త ఎంపిక జాబితాను 8 వారాల్లో విడుదల చేయాలని టీజీపీఎస్సీకి డెడ్‌లైన్ విధించిన హైకోర్టు, ఎక్కువ ఆలస్యం అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో 2015–16లో రాసిన గ్రూప్–2 అభ్యర్థులకు మళ్లీ ఆశలు మొలకెత్తాయి. పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కేసుకు తీర్పు రావడం, ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూసే వేలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
గ్రూప్–2 జవాబుపత్రాల్లో ట్యాంపరింగ్‌పై హైకోర్టు అసహనం
వైట్‌నర్, ఇతర దిద్దుబాట్లు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ వాటిని విలువైనవిగా పరిగణించి మూల్యాంకనం చేయడం చట్టపరంగా సరికాదని కోర్టు పేర్కొంది. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా తీసుకుని ఆ జవాబుపత్రాలన్నింటినీ పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
2015లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్–2 నియామకాల కోసం నోటిఫికేషన్ ప్రకటించగా, 2016 నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2019లో ఈ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. అయితే ప్రక్రియపై అనుమానాలతో అనేక మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ పిటిషన్లపై కోర్టు విచారణ పూర్తిచేసి కీలక తీర్పు వెల్లడించింది.

