దేశంలో హైదరాబాద్ నెంబర్ వన్ ... ఐటీ సిటీ బెంగళూరునే వెనక్కినెట్టేసిందిగా..!
Global Capability Centres (GCC) : ఐటీ సీటి బెంగళూరును మన నగరం హైదరాబాద్ వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు GCC ల ఏర్పాటులో మన నగరమే అగ్రస్థానంలో నిలిచింది.

గ్లోబల్ సిటీగా హైదరాబాద్
Global Capability Centres (GCC) : ప్రపంచం పూర్తిగా మారిపోయింది... గతంలో టాలెంట్ ఉన్నా ఉద్యోగాలు, ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు టాలెంట్ ను వెతుక్కుంటూ కంపెనీలే వస్తున్నాయి. ఇందుకోసం మల్టీ నేషనల్ కంపెనీలు (MNC) వ్యూహాత్మకంగా స్థాపిస్తున్న యూనిట్సే ఈ GCC (గ్లోబల్ కేపబిలిటి సెంటర్).
హైదరాబాద్ లో జిసిసి సెంటర్ల ఏర్పాటు
ఈ జిసిసి సెంటర్ల ఏర్పాటులో భారతదేశంలో టాప్ లో నిలుస్తోంది హైదరాబాద్. ఐటీతో పాటు టెక్నాలజీ రంగాల్లో ముందుండే బెంగళూరుకు గట్టిపోటీ ఇస్తోంది హైదరాబాద్. దేశంలో GCC సెంటర్స్ కూ అడ్డాగా మారిపోతోంది మన నగరం. ఇక్కడ టెక్నాలజీ, ఇన్నోవేషన్, టాలెంటెడ్ మానవ వనరులతో పాటు ఫ్యూచర్ రెడీ మౌళిక సదుపాయాలు జిసిసిల ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇది హైదరాబాద్ లో అంతర్జాతీయ సంస్థలు ఎందుకు క్యూ కడుతున్నాయో తెలియజేస్తోంది.
దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1
ప్రముఖ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ (UnearthInsight)ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు (జనవరి నుండి నవంబర్) హైదరాబాద్ లో 41కి పైగా కొత్త జిసిసిల ఏర్పాటు జరిగింది. ఇది దేశంలో ఏర్పాటైన GCC లలో 41 శాతం. బెంగళూరులో కూడా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 30కి పైగా జిసిసిలు మాత్రమే ఏర్పాటుచేశారు. దీన్నిబట్టి హైదరాబాద్ డిజిటల్, ఇంజనీరింగ్, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో గ్లోబర్ పవర్ హౌస్ గా మారుతోందని అర్థమవుతోంది.
హైదరాబాద్ లోనే GCC ల ఏర్పాటుకు కారణాలివే...
నగరంలో వైవిధ్యభరితమైన స్కిల్డ్ టాలెంట్ ఉంది... వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, టెక్ సంస్థలు గ్లోబల్ స్థాయి టాలెంట్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.
STEM (Science, Technology, Engineering, Mathematics) టాలెంట్ అందుబాటులో ఉంది. తద్వారా ఎలాంటి రంగాల్లో అయినా టెక్నాలజీ రోల్స్ నిర్వహించేందుకు వీలుంటుంది.
ఏఐ, డాటా, క్లౌడ్, బయోటెక్, ఫిన్ టెక్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి టాలెంట్ లభిస్తుంది.
స్టార్టప్స్ అనుకూలమైన ఎకో సిస్టమ్ ఇక్కడ ఏర్పడింది.
ఇలాంటి అనేక కారణాలు ఫార్చ్యూన్ 500 కంపెనీలను హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నాయి. రీసెర్చ్, డిజైన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇంజనీరిగ్, గ్లోబల్ ఆపరేషన్స్ కు నగరాన్ని ఎంచుకునేలా చేస్తున్నాయి.
GCC సెంటర్స్ గమ్యస్థానం హైదరాబాద్
ఇప్పటికే వ్యాన్ గార్డ్, స్టార్ రేజ్, మెక్ డొనాల్డ్స్, టి-మొబైల్, హెచ్సిఏ, హెల్త్ కేర్, సౌత్ వేస్ట్ ఎయిర్ లైన్స్, ఎలి లిల్లీ ఆండ్ కంపెనీ వంటివి హైదరాబాద్ లో మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లోనూ టాప్ లో నిలుస్తోంది. ఇండియా GCC గ్రోత్ స్టోరీని మార్చేదిశగా హైదరాబాద్ పయనం సాగుతోంది.