భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
IMD Rain Alert : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మరోసారి మారాయి. ఇటీవల తుఫాను ప్రభావంతో రాష్ట్రం అధిక నష్టం చవి చూసిన పరిస్థితుల్లో, తిరిగి వర్షాల హెచ్చరిక రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటన ప్రకారం, రాబోయే 24 నుండి 36 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతానికి నెమ్మదిగా బలపడుతూ, శ్రీలంక తీరానికి సమీపంగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గాలుల వేగం గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వరకు నమోదవుతుందని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మరోసారి భారీ వర్షాలు పడితే కొన్ని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు సహా పలు జిల్లాలకు హెచ్చరికలు
ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, కడప, శంకరంపేట, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం కూడా విస్తరిస్తుండటంతో, రాయలసీమ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో మధ్యస్థ స్థాయి వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇప్పటికే చలి తీవ్రత పెరిగి, కొన్నిచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం 35 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడం వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులను స్పష్టంగా చూపుతోంది. ఈ పరిస్థితుల్లో వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు
ఈదురుగాలుల తీవ్రత పెరగడంతో, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలనీ, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే అకాల వర్షాల కారణంగా భారీ నష్టాన్ని చవిచూశారు. మొంథా తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న విషయం మరువకముందే, మరోసారి వర్ష సూచన రావడం రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
తెలంగాణలో పెరుగుతున్న చలి.. తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్న అల్పపీడనం బలపడుతున్నందున, చెన్నై సహా ఏడు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాటిలో చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, మైలాడుత్తురై, నాగపట్నం, తిరువారూర్ జిల్లాలు ఉన్నాయి.
ఇక తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న వారం రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.