తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా..? వీరికి మాత్రమే రూ.5 లక్షల సాయమా?
తెలంగాణ వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ వరదల్లో ఎంతమంది చరిపోయారో తెలుసా?

తెలంగాణలో వరద బీభత్సం
Telangana Floods : ఇటీవల తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి... ఆగస్ట్ చివర్లో కురిసిన వానలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కేవలం గంటల వ్యవధిలో కుండపోతగా వర్షం కురవడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలు సంభవించాయి... ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోనూ నదులు, వాగులువంకలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహించాయి... చెరువులు, కుంటల గండ్లు తెగి వరదనీరు ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తింది. ఇలా ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది.
వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
తాజాగా తెలంగాణ ప్రభుత్వం వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. వరదనీటిలో కొట్టుకుపోయినవారు, వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. ఇక పంట నష్టపోయినా, పాడిపశువులతో ఇతర జీవాలు చనిపోయి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే అదికారులు వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని అంచనావేసే పనులను వేగవంతం చేశారని ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణ వరదల్లో ప్రాణనష్టం
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపైనుండి ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించి కార్లు, బైక్స్ కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో చాలానే వచ్చాయి. ఇక పశువులు మేపడానికి వెళ్లి వరదనీటిలో చిక్కుకుని కొందరు, గ్రామాలను వాగులువంకలు చుట్టుముట్టడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక మూగ జీవాల మరణాలకు అయితే లెక్కేలేదు.
తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారు?
అయితే అధికారిక లెక్కలు అంటే తెలంగాణ డిజిపి జితేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా 10 వరకు చనిపోయారు. హోంశాఖకు అందిన సమాచారం మేరకే డిజిపి ఈ మరణాలు గురించి చెప్పివుంటారు. దాదాపు 2 వేల మందిని వర్షాలు, వరదల నుండి సురక్షితంగా కాపాడినట్లు డిజిపి వెల్లడించారు. పోలీసులతో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది... ఎయిర్ ఫోర్స్, ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు డిజిపి జితేందర్ వెల్లడించారు.
ఇలా అధికారిక లెక్కలు 10 మందివరకే చనిపోయారని చెబుతున్నా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించిన నేపథ్యంలో మరణాలపై చర్చ మొదలయ్యింది. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు షురూ..
ఇప్పటికే తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే నాలుగైదురోజులు జోరువానలు కురుస్తాయయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
నేడు (మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలుంటాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.