ఉత్తరప్రదేశ్‌లోని 22 జిల్లాల్లో వరదలు సంభవించాయి… 2.5 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితం అయ్యారు. ఈ వరద సహాయ బాధితులకు యోగి సర్కార్ సహాయం చేసేందుకు సిద్దమయ్యింది. 

 Uttar Pradesh Floods: తెలంగాణలో మాదిరిగానే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. కొండ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు చాలా గ్రామాలను ముంచెత్తింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులను వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సీఎం యోగీ ఆదేశం: బాధితులకు సాయం

వరదల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పశువులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

22 జిల్లాల్లో 2.5 లక్షల మందికి పైగా ప్రభావితం

ప్రస్తుతం 22 జిల్లాల్లోని 43 తాలూకాలు, 768 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని సహాయ కమిషనర్ భాను చంద్ర గోస్వామి తెలిపారు. ఇప్పటివరకు 2,52,839 మంది ప్రభావితమయ్యారు, 33,370 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 37,279 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. సహాయక చర్యల కోసం 550 పడవలు, మోటార్ బోట్లు పనిచేస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 6,458 ఆహార ప్యాకెట్లు, 7,143 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు.

వరద శిబిరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ

వరద బాధితుల కోసం 278 శిబిరాలు ఏర్పాటు చేశారు, ప్రస్తుతం 3,089 మంది అక్కడ ఉంటున్నారు. వారి ఆరోగ్యం కోసం 586 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి 11,022 క్లోరిన్ టాబ్లెట్లు, 5,049 ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి 1,022 వరద చౌకీలు ఏర్పాటు చేశారు.

వరద ప్రభావిత జిల్లాలు

ప్రస్తుతం వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఔరయ్యా, బహ్రాయిచ్, బాందా, మీర్జాపూర్, కాన్పూర్ దేహత్, చందౌలీ, ఫతేపూర్, కాన్పూర్ నగర్, బారాబంకీ, బదాయూ, ఫరూఖాబాద్, గోండా, హర్దోయి, కాస్‌గంజ్, లఖింపూర్ ఖేరీ, మీరట్, మురాదాబాద్, ముజఫర్‌నగర్, షాజహాన్‌పూర్, ఉన్నావ్ జిల్లాల్లో వరదలు తీవ్రంగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు, పశువులకు సహాయం అందిస్తోంది. ఎవరూ ఆకలితో, అసురక్షితంగా ఉండకూడదని, అన్ని జిల్లాల్లోనూ తగిన ఏర్పాట్లు చేస్తున్నామని యోగీ సర్కార్ చెబుతోంది.