- Home
- Telangana
- Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి స్థాయి వర్షాలు... ఏఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టో తెలుసా?
Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి స్థాయి వర్షాలు... ఏఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టో తెలుసా?
నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేశారో ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ జోరువానలు
Telangana Weather : ఇప్పటికే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి... ఇటీవల కుండపోత వానలతో వరదలు సంభవించాయి. కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో వర్షబీభత్సం ఏస్థాయిలో కొనసాగిందో చూశాం... ఏపీలోని పలు జిల్లాల్లో కూడా వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రెండుమూడు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి... దీంతో పరిస్థితి కాస్త చక్కబడింది. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో మరోసారి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది.
KNOW
ఈ రెండ్రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడంతో తెలంగాణలో మళ్ళీ వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళ, బుధవారం కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు... మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
ఇవాళ (మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలుంటాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అల్పపీడన ప్రభావంలో ఇవాళ (మంగళవారం) వర్షాల కురిసే అవకాశాలున్నాయట… ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయట... దీంతో కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాబోయే ఐదురోజులు వర్షాలే
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే ఐదురోజులు అంటే ఈ వారమంతా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు (మంగళ, బుధవారం) విస్తారంగా వర్షాలు కురవనున్నాయి... అలాగే తీరంవెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి తీరప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని... మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.