- Home
- Telangana
- Telangana: తెలంగాణలో భారీగా తగ్గుతున్న ధరలు.. దేశంలో డిఫ్లేషన్‌లోకి వెళ్లిన ఏకైక రాష్ట్రం. కానీ ఇక్కడే ఓ సమస్య..
Telangana: తెలంగాణలో భారీగా తగ్గుతున్న ధరలు.. దేశంలో డిఫ్లేషన్‌లోకి వెళ్లిన ఏకైక రాష్ట్రం. కానీ ఇక్కడే ఓ సమస్య..
తెలంగాణలో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రం ఇప్పుడు డిఫ్లేషన్ అనే అరుదన ఆర్థిక పరిస్థితిలోకి వెళ్లింది. అయితే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అయినా మరో రకంగా మాత్రం బ్యాడ్ న్యూస్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

దేశంలో డిఫ్లేషన్‌లోకి వెళ్లిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
తెలంగాణ డిఫ్లేషన్ (ప్రతి ద్రవ్యోల్బణం) అనే అరుదైన ఆర్థిక పరిస్థితిలోకి అడుగుపెట్టింది. దీని అర్థం ధరలు పెరగకుండా, తగ్గిపోతున్నాయి అన్నమాట. జూలై 15న కేంద్ర గణాంకాల శాఖ (MoSPI) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 2025 జూన్ నెలలో తెలంగాణలోద్రవ్యోల్బణ రేటు -0.93 శాతంగా నమోదైంది. ఇదే సమయానికి దేశ సగటు ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది.
గ్రామీణ, పట్టణ తెలంగాణలో ధరల పరిస్థితి
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం మరింతగా తగ్గింది. గ్రామీణ తెలంగాణలో ఇది -1.54%గా ఉండగా దేశ సగటు గ్రామీణ ద్రవ్యోల్బణం 1.72%గా ఉంది. అలాగే పట్టణ తెలంగాణలో -0.45%గా ఉండగా దేశ సగటు పట్టణ ద్రవ్యోల్బణం 2.56%గా ఉంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. అక్కడ మొత్తం ద్రవ్యోల్బణం 0.0 శాతంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో -0.55%, పట్టణాల్లో మాత్రం 1.06%గా నమోదైంది.
గతంతో పోల్చితే భిన్నంగా
తెలంగాణలో 2020 నుంచి 2023 వరకు ద్రవ్యోల్బణం 10 శాతం పైగా ఉండేది. ఆ సమయంలో ప్రజలు ఆహారం, పెట్రోల్, గ్యాస్, వసతులు ఇలా అన్ని వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందిపడ్డారు. కానీ 2023 డిసెంబర్ తర్వాత ధరలు తగ్గడం మొదలైంది. ద్రవ్యోల్బణం 2025 ఫిబ్రవరిలో 1.31%గా ఉండగా, మార్చిలో 1.06%గా,
ఏప్రిల్‌లో 1.26%గా, మే నెలలో 0.55%గా, జూన్ నెలలో -0.93%గా ఉంది. ఈ గణంకాలు వరుసగా ఐదు నెలలుగా ధరల పెరుగుదల తగ్గుతూనే ఉందని సూచిస్తున్నాయి.
తమ విజయమే అంటోన్న కాంగ్రెస్
ఇది తమ ప్రభుత్వ విజయమే అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – “ఇది ప్రజలకే ప్రయోజనకరంగా ఉండే పాలన ఫలితం,” అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ముఖ్యమైన ప్రభుత్వ పథకాల వల్ల ప్రజల ఖర్చులు తగ్గాయని ఆయ తెలిపారు.
ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రేషన్ కార్డు దారులకు ఉచితంగా సన్నబియ్యం వంటి పథకాల ద్వారా కుటుంబాల ఖర్చు భారం తగ్గించడంలో కీలకంగా మారినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే.?
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చులు తగ్గడమే కాకుండా, ఆహార ధరలు తగ్గడం, విద్యుత్ చార్జీల నియంత్రణ కూడా డిఫ్లేషన్‌కు కారణమయ్యే అంశాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీన్ని కేవలం ప్రభుత్వ పథకాల ఫలితంగా మాత్రమే చూడకూడదని, మార్కెట్‌లో ఉన్న ఇతర కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ధరలు తగ్గడం మంచిది కాదా.?
తాత్కాలికంగా చూస్తే ధరలు తగ్గడంలో వినియోగదారులకు ఊరటగానే అనిపించినా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని మరికొందరు వాదిస్తున్నారు. డిఫ్లేషన్ అంటే మార్కెట్ డిమాండ్ తగ్గడం, పెట్టుబడులు తగ్గిపోవడం, ఆర్థిక మందగమనానికి సంకేతం కావచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఆ స్థాయికి వెళ్లలేదని, ఇది ప్రభుత్వ చర్యల వల్ల కలిగిన సరఫరా-ధరల నియంత్రణ ఫలితంగానే అని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
ద్రవ్యోల్బంణం మైనస్‌లోకి వెళ్లడం ఆర్థిక సంక్షోభానికి సంకేతం అనే వాదన కూడా వస్తోంది. ప్రజలు భయంతోనే ఖర్చులు తగ్గిస్తున్నారని దీని కారణంగానే మార్కెట్లో అస్థిరత ఉందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ప్రస్తుతం భిన్న ఆర్థిక పరిస్థితి నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.