- Home
- Telangana
- Smart Farming: తెలంగాణలో తొలిసారి స్మార్ట్ వ్యవసాయం, 80 ఎకరాల్లో హైటెక్ తోటలు.. ఎక్కడంటే
Smart Farming: తెలంగాణలో తొలిసారి స్మార్ట్ వ్యవసాయం, 80 ఎకరాల్లో హైటెక్ తోటలు.. ఎక్కడంటే
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో స్మార్ట్ ఫార్మ్ ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు. ఇంతకీ ఏంటా స్మార్ట్ ఫార్మింగ్, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో స్మార్ట్ ఫార్మ్ ప్రారంభానికి సిద్ధం
తెలంగాణ రాష్ట్రం మలుగు జిల్లా కోట్యాల గ్రామంలో 80 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక తోటల ఫార్మ్ ఏర్పాటుకు శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ (SKLTSHU) ఏర్పాట్లు చేస్తోంది.
ఇది కేవలం తోటల సాగు కేంద్రం మాత్రమే కాకుండా, భవిష్యత్తు రైతులకు, విద్యార్థులకు, అగ్రి ఎంట్రప్రెన్యూర్స్‌కు ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించే డెమో సెంటర్‌గా మారనుంది.
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై దృష్టి
ఇందులో భాగంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ప్రిసిషన్ ఫార్మింగ్, హై-డెన్సిటీ ప్లాంటింగ్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించనున్నారు.
ప్రిసిషన్ ఫార్మింగ్: తక్కువ నీరు, ఎరువు వాడకంతో అధిక దిగుబడి.
హై-డెన్సిటీప్లాంటింగ్: తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే విధానం.
ప్రొటెక్టెడ్ కల్టివేషన్: గ్రీన్ హౌస్, షేడ్ నెట్ ద్వారా వాతావరణ ప్రభావాల నుండి రక్షణ.
ఎగ్జోటిక్ పంటల సాగు
ఈ ఫార్మ్‌లో సాధారణ పంటలతో పాటు రాష్ట్రంలో అరుదుగా కనిపించే ఎగ్జోటిక్ పంటల సాగు కూడా జరగనుంది. వీటిలో ప్రధానంగా బోక్‌చాయ్, లెట్యూస్, బ్లూబెరీస్, స్ట్రాబెరీస్, డ్రాగన్ ఫ్రూట్, కిన్నో (సిట్రస్ ఫ్రూట్), బ్రోకోలి, ట్యూబర్ వెజిటబుల్స్, పైనాపిల్ వంటి పంటలను సాగు చేస్తారు. ఈ పండ్లు మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి. ఇటీవల యువ రైతులు ఇలాంటి పంట సాగుపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.
విద్యార్థులకు, రైతులకు ప్రాక్టికల్ శిక్షణ కేంద్రం.?
వ్యవసాయ రంగంలోకి రావాలనుకునే యువ రైతులకు ఇది ఒక శిక్షణ కేంద్రంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ ఫార్మింగ్‌లో మెలుకవలు నేర్చుకొని వ్యవసాయం చేయొచ్చు. ఈ విషయమై యూనివర్సిటీ డైరెక్టర్ నటరాజన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. "ఏటా పంటలతో పాటు శాశ్వత పంటల సాగుకూ ఇది ఉపయోగపడుతుంది." అని తెలిపారు.
స్మార్ట్ ఫార్మింగ్ వల్ల కలిగే లాభాలు:
స్మార్ట్ ఫార్మింగ్ విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందొచ్చు. వాతావరణ మార్పుల ప్రభావం లేకుండా పంటల సాగు జరుగుతుంది. ఎగ్జోటిక్ పంటల ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు.
రైతుల్లో మౌలిక పరిజ్ఞానం పెరుగుతుంది. యువతకు అగ్రి స్టార్టప్ అవకాశాలు పెరుగుతాయి. ఈ మోడల్ రైతులకు కొత్త దారి చూపుతోంది. ఇది వ్యవసాయ రంగానికి నూతన ఆవిష్కరణల మార్గదర్శకంగా నిలుస్తోంది.