- Home
- Telangana
- Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?
Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?
Sankranti Holidays 2026 : స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై ఓ క్లారిటీ వచ్చేసింది… మరి కాలేజీ విద్యార్థుల సంగతేంటి..? వారికి సంక్రాంతి హాలిడేస్ ఎన్నిరోజులో తెలుసా?

కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?
Sankranti Holidays : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఈవారమే మొదలుకానుంది... ఇక వచ్చే వారమంతా ఫెస్టివల్ వైబ్స్ కొనసాగుతాయి. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్దమయ్యారు... పిల్లలకు సెలవులు రావడమే ఆలస్యం.... వెంటనే సర్దుకున్న లగేజీతో ప్రయాణం ప్రారంభం కానుంది. మరో నాలుగైదు రోజులు గడిస్తే చాలు... విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభంకానున్నాయి.
స్కూళ్లకు ఇప్పటికే సంక్రాంతి సెలవులపై క్లారీటీ వచ్చింది.. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా జనవరి 10 నుండి 18 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులున్నాయి. మరి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల సంగతేంటి..? కాలేజీ విద్యార్థులకు ఎన్నిరోజుల సెలవులు ఉన్నాయి? కాలేజీలకు సంక్రాంతి హాలిడేస్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం.
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు..?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చాలామంది ఆంధ్రా విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతుంటారు. వీళ్లు ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయా.. ఎప్పుడెప్పుడు సొంతూళ్లకు వెళదామా... అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సంక్రాంతికి జనవరి 11 నుండి 18 వరకు తెలంగాణలోని అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది... తిరిగి జనవరి 19న విద్యాసంస్థలకు ప్రారంభం అవుతాయని తెలిపింది.
జనవరి 10న రెండో శనివారం సెలవు కూడా ఇంటర్ విద్యార్థులకు కలిసిరానుంది. అంటే జనవరి 11 నుండి కాదు జనవరి 10 నుండే సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. స్కూల్ విద్యార్థుల మాదిరిగానే మొత్తం తొమ్మిదిరోజులు సెలవులు వస్తున్నాయి. గతేడాది కేవలం నాలుగు రోజులే (జనవరి 13-16, 2025) సంక్రాంతి సెలవులు వచ్చాయి... ఈసారి ఏకంగా తొమ్మిదిరోజుల సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు.
తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు..?
తెలంగాణలో డిగ్రీ విద్యార్థులకు మాత్రం కేవలం రెండ్రోజులే సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీలకు జనవరి 14 సంక్రాంతి, జనవరి 15 భోగికి మాత్రమే సెలవులుంటాయని అధికారికంగా ప్రకటించారు. ఓయూ హాలిడే క్యాలెండర్ లో ఈ సెలవులు గురించి పేర్కొన్నారు.
అయితే సంక్రాంతి ముందు విద్యార్థులకు రెండ్రోజులు (జనవరి 10 రెండో శనివారం, జనవరి 11 ఆదివారం) సెలవులు కలిసిరానున్నాయి. తర్వాత రెండ్రోజులు (జనవరి 12,13) కవర్ చేసుకుంటే డిగ్రీ విద్యార్థులు కూడా సంక్రాంతికి ఏకంగా ఆరురోజులు సెలవులు పొందవచ్చు.
తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు..?
తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లో వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు వెలిశాయి... JNTU పరిధిలో నడిచే ఈ కాలేజీల్లో లక్షలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇటీవల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు బంద్ పాటించాయి. దీంతో విద్యార్థుల సిలబస్ పై ప్రభావం పడింది. దీన్ని కవర్ చేసుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
సంక్రాంతి సెలవులపై JNTU అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. డిగ్రీ కాలేజీల మాదిరిగానే జనవరి 14, జనవరి 15 రెండ్రోజులే ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా సెలవు ఉండనుంది. కాలేజీ మేనేజ్మెంట్స్ పండగ సెలవులపై విద్యార్థులకు సమాచారం ఇస్తాయి. దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది.
తెలంగాణ స్కూళ్లకి సంక్రాంతి సెలవులు..?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. జనవరి 10 నుండి 18 వరకు అంటే తొమ్మిదిరోజులు పండగ సెలవులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది... జనవరి 19న విద్యాసంస్థలకు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇలా ఇంకో నాలుగు రోజులు గడిస్తే చాలు విద్యార్థులకు సెలవులు ప్రారంభం కానున్నాయి.

