Pahalgam Terror Attack: పీవోకేను భారత్ లో కలిపేయండి.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న మద్దతు ఇస్తామని తెలిపారు. పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy
Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయినవారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు.
Telangana Chief Minister Revanth Reddy
సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్‌గామ్‌లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)
"ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని" రేవంత్ రెడ్డి అన్నారు.
అలాగే, 1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్‌పై నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో మన దేశం చూపిన తెగువను గుర్తు చేస్తూ.. "ఇందిరా గాంధీ గారి స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రి గారికి మద్దతు ఇస్తాం. అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నాం" అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
revanth reddy.j
హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.