- Home
- Telangana
- Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
Hyderabad Real Estate : హైదరాబాద్ ఉత్తర భాగంలో రియల్ ఎస్టేట్ దూకుడు మొదలైంది. కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ ప్రాంతాల్లో ఐటీ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలతో కొత్త రియల్ బూమ్ వస్తోంది. పెట్టుబడిదారులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.

మేడ్చల్ హైవేలో రియల్ బూమ్.. ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు!
హైదరాబాద్ అంటే ఒకప్పుడు కేవలం పశ్చిమ భాగంలో మాదాపూర్, గచ్చిబౌలి గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు నగరం నలువైపులా విస్తరిస్తోంది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ఇప్పుడు సరికొత్త పెట్టుబడుల కేంద్రంగా అవతరించింది. కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం మునుపెన్నడూ లేని విధంగా పుంజుకుంటోంది. ఒకప్పుడు ప్రశాంతమైన ఫామ్ హౌస్‌లకు నిలయమైన ఈ ప్రాంతం, నేడు ఆకాశహర్మ్యాలకు కేంద్రంగా మారుతోంది.
పశ్చిమ హైదరాబాద్‌ను మించి.. కండ్లకోయ ఐటీ పార్క్ సంచలనం
తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలనే లక్ష్యంతో గ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కండ్లకోయలో నిర్మిస్తున్న ఐటీ పార్క్ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయనుంది. సుమారు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ఐటీ టవర్, ఐకానిక్ సైబర్ టవర్స్ కంటే పెద్దది కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇక్కడ సుమారు 50 వేల మందికి పైగా సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉపాధి లభించనుంది. ఐటీ కంపెనీల రాకతో ఈ ప్రాంతంలో నివాస గృహాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
సామాన్యుడికి అందుబాటులో ధరలు : కొంపల్లి టు మేడ్చల్
గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో చదరపు అడుగు ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. దానికి భిన్నంగా ఉత్తర హైదరాబాద్‌లో ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి.
• అపార్ట్‌మెంట్లు: చదరపు అడుగుకు రూ. 4,500 నుంచి రూ. 5,500 వరకు పలుకుతోంది.
• గేటెడ్ కమ్యూనిటీలు: రూ. 5,500 నుంచి రూ. 6,500 మధ్య లభిస్తున్నాయి.
• ఓపెన్ ప్లాట్లు: గజం రూ. 60 వేల నుండి రూ. 80 వేల వరకు ఉంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే ఇన్వెస్టర్లకు, సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు కొంపల్లి, మేడ్చల్ బెస్ట్ ఆప్షన్లుగా మారాయి.
అద్భుతమైన కనెక్టివిటీ.. మౌలిక సదుపాయాల జోరు
ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణం ఇక్కడి రవాణా సౌకర్యాలు. నాగ్‌పూర్ జాతీయ రహదారి (NH-44) ఈ ప్రాంతం గుండా వెళ్లడం అతిపెద్ద ప్లస్ పాయింట్.
• ఎలివేటెడ్ కారిడార్లు: సుచిత్ర నుంచి జీడిమెట్ల, కొంపల్లి వరకు సుమారు 10 కి.మీల మేర ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. ఇది ట్రాఫిక్ చిక్కులను తొలగిస్తుంది.
• రైల్వే, ఎంఎంటీఎస్ : బొల్లారం, మేడ్చల్ ప్రాంతాలకు ఇప్పటికే ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది.
• విద్య, వైద్యం: జీనోమ్ వ్యాలీ, నల్సార్ యూనివర్సిటీ, మెడిసిటీ వంటి ప్రముఖ సంస్థలు ఈ జోన్‌లోనే ఉన్నాయి. 30 నిమిషాల్లోనే ప్రధాన నగరానికి చేరుకునే వెసులుబాటు ఉండటం వల్ల నివాసానికి ఇది అత్యంత అనుకూలం అని చెప్పొచ్చు.
భవిష్యత్తుపై భారీ అంచనాలు : రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్
ప్రస్తుతం జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, శామీర్‌పేట వంటి ప్రాంతాలు రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్లుగా మారాయి. కేవలం నగరవాసులే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల వారు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. బడా నిర్మాణ సంస్థలు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ నుంచి దృష్టి మళ్ళించి, మేడ్చల్ హైవేలో భారీ విల్లా ప్రాజెక్టులు, పెద్ద పెద్ద బిల్డింగ్ ల నిర్మాణానికి భూసేకరణ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాంతం గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చెందే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

