liquor prices hiked: మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు ఎంత పెరిగాయంటే?
liquor prices hiked: మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కారు. మద్యం ధరలను భారీగా పెంచింది. మద్యం ధరలు ఒక్కో బాటిల్ పై రూ.10 నుంచి రూ.40 వరకు పెరిగాయి.

మందుబాబులకు షాక్
Liquor prices in Telangana hiked: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద స్పెషల్ ఎక్సైజ్ సెస్స్‌ను పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం (మే 18న) విడుదల చేసిన ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ఈ పెంపు మద్యం కొనుగోలు దారులపై ప్రభావం చూపనుంది.
తెలంగాణలో పెరిగిన లిక్కర్ ధరలు
తెలంగాణ సర్కార్ ఉత్తర్వుల ప్రకారం, 180 మిల్లీల బాటిల్‌పై రూ.10 సెస్స్ విధించారు. దీని ప్రకారం 350 మిల్లీల హాఫ్ బాటిల్‌పై రూ.20, అలాగే, 750 మిల్లీల ఫుల్ బాటిల్‌పై రూ.40 మేర పెంపు అమల్లోకి వచ్చింది. ఇది ఇండియన్ మేడ్ ఫారెన్ లికర్ (IMFL), ఫారిన్ లికర్ (FL) బ్రాండ్లకు వర్తించనుంది.
మద్యం ధరల పెంపు: కొత్త ధరల బోర్డులు పెట్టాల్సిందే !
సాధారణ మద్యం, రెడీ-టు-డ్రింక్ (RTD) బీవరేజెస్, బీరు ధరలపై ఈ సెస్స్ వర్తించదు. మద్యం సరఫరాదారులు కొత్త మాక్సిమమ్ రిటైల్ ప్రైస్ (MRP)తో స్టాకులు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు. తెలంగాణ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయని తెలిపారు.
నిబంధనల ప్రకారం, అన్ని లైసెన్స్ హోల్డర్లకు కొత్త ధరల సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని డిపోల్లో సవరించిన ధరల జాబితాలు అందుబాటులో ఉంచాల్సి ఉంది.
మద్యం ధరల పెంపుతో ప్రతి నెలా అదనంగా రూ.170 కోట్లు ఆదాయం
ఈ ధర పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అదనంగా రూ.170 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం సుమారు రూ.34,000 కోట్లు ఆదాయం పొందగా, ఈసారి లక్ష్యం రూ.40,000 కోట్లుగా ఉంది.
దాదాపు 2వేల మద్యం బ్రాండ్ల ధరలు పెరిగాయి
ఇటీవలే బీరు ధరలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. తాజా ధరల పెంపు తర్వాత రాష్ట్రంలో దాదాపు 2,000 మద్యం బ్రాండ్ల ధరలు పెరిగాయి. ఈ పెంపు కేవలం వినియోగదారులకు వర్తించనుండగా, తయారీదారులు-సరఫరాదారులపై అదనపు ధరల భారం పడదు.
ప్రతి రెండేళ్లకు ధరలు పెంచుకునే వెసులుబాటు
రేటు కాంట్రాక్ట్ ప్రకారం తయారీదారులకు ప్రతి రెండేళ్లకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఉన్నా, చివరిసారి 2023లోనే పెంపు జరిగినట్లు సమాచారం. తయారీ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుత ధరలకు సరఫరా చేయడం కష్టమవుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి ధరల పెంపు విన్నవించగా, ప్రభుత్వం ఒకే చెప్పింది. మవద్యం ధరల పెంపు ఉత్తర్వులు ఆదివారం విడుదలయ్యాయి.