తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డులను అందజేసే ప్రక్రియను మొదలు పెట్టింది. ఓవైపు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణతో పాటు రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను యాడ్ చేసే అవకాశం కల్పించారు.
తెలంగాణలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. 2025 ఫిబ్రవరి నుంచి మే మధ్య వరకు దాదాపు 17 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులకులో జతచేసినట్టు అధికారిక సమాచారం. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందే అవకాశాన్ని సంపాదించుకున్నారు.
ఇంతకాలం ఆరోగ్యశ్రీ వంటి పథకాలకి అప్లై చేసుకునే అవకాశంలేకుండా ఉన్న వారు ఇప్పుడు రేషన్ కార్డులపై పేర్లు నమోదు కావడంతో అర్హత పొందనున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, ఆహార భద్రత పథకాలతో వారు నేరుగా లాభపడతారు.
మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త దరఖాస్తుల స్వీకరణను ఫిబ్రవరిలో ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు 1.51 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. ఈ కొత్త కార్డుల ద్వారా 3.24 లక్షల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో 13.73 లక్షల కొత్త పేర్లు కూడా చేర్చారు.
గత 8 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 21 లక్షల దరఖాస్తుల్లో ఇప్పుడు పెద్ద మొత్తంలో నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా అదనంగా 6,952 టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ప్రస్తుతం రెండు రకాల రేషన్ కార్డులు వైట్, పింక్ కార్డులు జారీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అయితే ఈ విధానం ఇంకా అమలులోకి రాలేదు.


