- Home
- Telangana
- ‘తెలంగాణ రథ చక్రం విరిగింది’.. తండ్రితో యుద్ధం మొదలు.. కవిత కొత్త పార్టీ పేరెంటో తెలుసా.?
‘తెలంగాణ రథ చక్రం విరిగింది’.. తండ్రితో యుద్ధం మొదలు.. కవిత కొత్త పార్టీ పేరెంటో తెలుసా.?
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత తాజాగా తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. శనివారం (ఈరోజు) మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్‌లో నిర్వహించిన సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు.

మునీరాబాద్ సభలో అధికారిక ప్రకటన
శనివారం జరిగిన ఆవిర్భావ సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభా ప్రాంగణానికి చేరుకున్న కవితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్టేజ్ పైకి చేరుకున్న అనంతరం ఆమె పార్టీ పేరును ప్రకటించి, జెండాను ఆవిష్కరించారు. “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)” అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
అమరవీరులకు నివాళి
పార్టీ ప్రకటనకు ముందు కవిత హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి వెళ్లి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వీరులను స్మరించుకుంటూ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో మునీరాబాద్ సభకు చేరుకున్నారు.
సర్వోదయ తెలంగాణ లక్ష్యం
తన పార్టీ లక్ష్యాలను వివరిస్తూ కవిత “సర్వోదయ తెలంగాణ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం, అట్టడుగు స్థాయి వ్యక్తి అభివృద్ధి, ఆర్థిక-సామాజిక సమానత్వం సాధించడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహాత్మా గాంధీ ప్రోత్సహించిన సర్వోదయ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సమాన హక్కులు – సమాన వాటా
ప్రజల్లో ప్రతి వర్గానికి వారి జనాభా శాతానికి అనుగుణంగా అవకాశాలు రావాలనే భావనను కవిత స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన ప్రతినిధ్యం కల్పించడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
పార్టీ ఏర్పాటుకు విస్తృతంగా చర్చలు
పార్టీ ఏర్పాటు ముందు కవిత పలు వర్గాల అభిప్రాయాలు సేకరించారు. ఉద్యమకారులు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు, నిపుణులతో చర్చలు జరిపి పార్టీ దిశను నిర్ణయించారు. రాజకీయ వ్యూహాలపై ప్రముఖ విశ్లేషకులతో కూడా సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పార్టీ ఎజెండాను రూపొందించారు.
బహుజనాలపై దృష్టి
ఈ పార్టీ బహుజన వర్గాల సాధికారతపై దృష్టి పెట్టనుందని కవిత తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువత, మహిళలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు ఎజెండాలో భాగంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కొంతమంది మాజీ నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో చేరినట్లు సమాచారం.
తండ్రిని టార్గెట్ చేస్తూ స్పీచ్
ఇప్పటి వరకు కేవలం హరీష్‌రావు, సంతోష్ రావు, కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కవిత తొలిసారి తన తండ్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్ దారి తప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని, సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైపోయిందని కవిత విరుచుకుపడ్డారు.
మొత్తం మీద కొత్త పార్టీ ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ ప్లాట్ ఫామ్ ను నిర్మించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కవిత ప్రారంభించిన “తెలంగాణ రాష్ట్ర సేన” పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు తెర తీస్తుందో చూడాలి.

