IMD Rain Alert : హైదరాబాద్ ప్రజలారా... ఈ రాత్రి జాగ్రత్తగా ఉండండి
IMD Rain Alert : ఈ రాత్రి తెలంగాణవ్యాప్తంగా మరీముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

హైదరబాదీలు తస్మాత్ జాగ్రత్త
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొద్దిసేపటిక్రితమే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది... కొన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఇదేస్థాయిలో వర్షం కురిసింది. అయితే ఇంతటితో వర్షాలు ముగియలేదు... ఈ రాత్రి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కాబట్టి ఇటీవల భారీ వర్షపునీటిలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రాత్రి వర్షం కురిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి
కాలువలు, చెరువులు, వాగుల సమీపంలోని నివాసితులు... రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అండర్ పాస్ లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, నీరు నిల్వవుండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి... వర్షపునీటితో ప్రమాదకరంగా మారిన ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... వర్షపునీరు పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇలా ఈ రాత్రి వర్షం కురిసే అవకాశాలున్న ప్రాంతాల్లో ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి.
IMD హెచ్చరిక
తెలంగాణలో గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లో కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురిసింది... ఇక రాత్రికూడా భారీ వర్షం కురిసిందంటే పరిస్థితి భయానకంగా మారవచ్చు.
7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated : 18/09/2025 @TelanganaCS@DCsofIndia@IASassociation@TelanganaDGP@TelanganaCMO@GHMCOnline@HYDTP@IasTelangana@tg_weather@CommissionrGHMC@Comm_HYDRAA@Indiametdeptpic.twitter.com/2oMZuFHySN
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 18, 2025
తెలంగాణ జిల్లాల్లో ఈ రాత్రి భారీ వర్షాలు
ఇక జిల్లాల విషయానికి వస్తే... సూర్యపేట, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశాలున్నాయట. ఈ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి... రాత్రి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రకటించారు. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
హైదరాబాద్ లో సాయంత్రం కుండపోత
ఇదిలావుంటే హైదరాబాద్ ను గురువారం సాయంత్రం కేవలం గంటసేపు కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. కొన్నిప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 7.6 సెం.మీ, నెహ్రూ జూపార్క్ దగ్గర 6.9, రూప్‌లాల్ బజార్‌లో 6.9, నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆల్వాల్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, మారేడ్‌పల్లి, ఉప్పల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్
సాయంత్రం సమయంలో భారీ వర్షం కురవడంతో ఉద్యోగులు, వ్యాపారులు రోడ్లపైనే చిక్కుకున్నారు... దీంతో ప్రధాన రహదారులపై వాహనాలు స్తంభించి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వరకు, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు, మెహదీపట్నం నుంచి రాయదుర్గం వరకు, సచివాలయం నుండి ట్యాంక్‌బండ్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటు హైటెక్ సిటి నుండి కూకట్ పల్లి, మియాపూర్ వైపు వెళ్లే దారులు కూడా వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు స్లో అయ్యాయి... దీంతో కిలోమీటర్లకొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది.
#HYDTPinfo#RainAlert
Due to heavy #rainfall, waterlogging has been reported near Praja Bhavan, resulting in slow vehicular movement. @shotr_pgt officers are on-site, regulating traffic. #HyderabadRains#MonsoonSeason2025#TrafficUpdatepic.twitter.com/9Zo25okzE9— Hyderabad Traffic Police (@HYDTP) September 18, 2025
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో జిహెచ్ఎంసి, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా సిబ్బంది ఎమర్జెనీ విధులకోసం రెడీగా ఉంచినట్లు రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ ,విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడ ఇబ్బందులు ఉన్న వెంటనే స్పందించాలని తెలిపారు.

