- Home
- Telangana
- IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే... నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే... నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
IMD Rain Alert : తెలంగాణలో నిన్న(సెప్టెంబర్ 16న) అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదయ్యింది? ఇవాళ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాలను వీడని వర్షాలు
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది... అయినా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తగ్గడంలేదు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి... మరికొన్నిరోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ (సెప్టెంబర్ 17, బుధవారం) పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఇరురాష్ట్రాల వాతావరణ విభాగాలు హెచ్చరించాయి.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
తూర్పు విదర్భలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఆకాశం మేఘాలతో కప్పేసి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగానే ఉంటుందని... కొన్నిచోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
నేడు హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉంటుంది కానీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు తక్కువని వాతావరణ శాఖ చెబుతోంది. సాయంత్రం సమయంలో కొన్నిచోట్ల చిరుజల్లులు కురవొచ్చని చెబుతున్నారు. శివారుప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వెల్లడించారు.
తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలు
సెప్టెంబర్ 16న (మంగళవారం) తెలంగాణలో అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లా రేగోడ్ లో 109.8 మిల్లిమీటర్లు నమోదయ్యింది. ఇదే మెదక్ జిల్లా కుల్చారంలో 104, అల్లాదుర్గంలో 94, పాపన్నపేటలో 78, టేక్మాల్ లో 71 మి.మీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో 77, జగిత్యాల జిల్లా బుగ్గారంలో 71, లక్షెట్టిపేటలో 62, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 67, సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 63 సెం.మీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమలో అంటే చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. రాయలసీమలో రేపు (గురువారం) కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.