- Home
- Telangana
- IMD rain Alert : భారీ వర్షాలే కాదు పిడుగులు కూడా.. నేడు ఈ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
IMD rain Alert : భారీ వర్షాలే కాదు పిడుగులు కూడా.. నేడు ఈ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
IMD rain Alert : తెెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి… ఇవి మరో నాలుగురోజులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ విభాగం ప్రకటించింది. వీటికి పిడుగులు, ఈదురుగాలులు కూడా తోడవుతాయని హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరికొద్దిరోజులు వర్షాలు తప్పేలా లేవు. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా రేపు(గురువారం) మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఇదికాస్త మరింత బలపడి శుక్రవారానికి వాయుగుండంగా మారి శనివారం ఒడిషా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వీటికితోడు ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి... వీటన్నింటి ప్రభావంతో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వారమంతా కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
నేడు తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... నేడు (సెప్టెంబర్ 24, బుధవారం) తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పిడుగులు, బలమైన ఈదురుగాలులు కూడా ఈ వర్షాలకు తోడవుతాయని తెలిపింది.
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇక రేపు (సెప్టెంబర్ 25, గురువారం) ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్ నగర్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :23-09-2025 pic.twitter.com/OrC84eEEDV
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 23, 2025
ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగుల ప్రమాదం...
ప్రస్తుతం ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుందని... వీటి ప్రభావంతో ఆదివారం వరకు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు, విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
నేడు (బుధవారం, సెప్టెంబర్ 24) ఏపీలో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మూడ్రోజులు ఏపీలో కుండపోతే
ఇక గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాలో పలుచోట్ల అతిభారీవర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రఖర్ జైన్. గురువారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.