హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నగరం చుట్టూ భారీ రైల్వే టెర్మినల్స్
Hyderabad New Mega Railway Terminals: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్! నగరం చుట్టూ మూడు కొత్త రైల్వే టెర్మినళ్లు నిర్మించడానికి దక్షిణ మధ్య రైల్వే ముందుకు వచ్చింది. ఇవి నగర ప్రయాణ రూపురేఖలను మార్చనున్నాయి.

హైదరాబాద్ రవాణా వ్యవస్థకు కొత్త దిశ
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న మెట్రో నగరాల్లో టాప్ లో ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు చేరుకుంటున్నారు. రద్దీ తీవ్రంగా పెరుగుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినళ్లను ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించింది.
ఈ మూడు టెర్మినళ్ల నిర్మాణం పూర్తయితే, రాబోయే 50 సంవత్సరాల నగర ప్రయాణ అవసరాలను తీర్చగల వ్యవస్థ సిద్ధం కానుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇవి కేవలం అదనపు స్టేషన్లు కాకుండా, నగర రవాణా రూపురేఖలను మార్చే మెగా హబ్‌లుగా నిలవనున్నాయి.
నాగులపల్లి: దేశంలోనే అతిపెద్ద టెర్మినళ్లలో ఒకటిగా అవతరణ
వికారాబాద్-ముంబయి మార్గంలో ఉన్న నాగులపల్లి టెర్మినల్ ప్రాజెక్ట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ టెర్మినల్‌లో 20 ప్లాట్‌ఫారాలు, భారీ స్టేబ్లింగ్ లైన్లు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రధాన రైల్వే కారిడార్లకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది.
నాగులపల్లి స్టేషన్ దేశంలోనే మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్‌గా మారే అవకాశం ఉంది. హైటెక్ డిజైన్, పెద్ద ప్రాంగణం, రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ దీనిని భవిష్యత్ రవాణా హబ్‌గా నిలబెట్టనున్నాయి.
జూకల్-శంషాబాద్, డబిల్పూర్-మేడ్చల్ టెర్మినళ్లు
హైదరాబాద్ తూర్పు, ఉత్తర దిశల్లో రైల్వే రద్దీ తగ్గించేందుకు రెండు కొత్త టెర్మినళ్లు ప్లాన్ చేశారు. అవి జూకల్-శంషాబాద్ టెర్మినల్, డబిల్పూర్–మేడ్చల్ టెర్మినల్.
జూకల్-శంషాబాద్ టెర్మినల్
• మహబూబ్‌నగర్ - బెంగళూరు మార్గానికి ప్రధాన సర్వీస్ సెంటర్
• తూర్పు-దక్షిణ భారత ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ప్రత్యేక అనుసంధానం
• శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సరికొత్త రైలు యాక్సెస్ అవకాశాలు
డబిల్పూర్-మేడ్చల్ టెర్మినల్
• నిజామాబాద్ - నాందేడ్ - ఔరంగాబాద్ వైపు వెళ్లే రైళ్ల కోసం ప్రత్యేక టెర్మినల్
• ఉత్తర తెలంగాణ, మారాఠ్వాడ ప్రాంతాలకు ఫాస్ట్ కనెక్టివిటీ
ఈ టెర్మినళ్లు సిద్ధం అయితే, ప్రస్తుతం ఉన్న స్టేషన్లపై ఒత్తిడి భారీగా తగ్గుతుంది.
ప్రధాన స్టేషన్లకు తగ్గనున్న రద్దీ
ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు భారీ ఒత్తిడిలో పనిచేస్తున్నాయి. నిత్యం వేలాది ప్రయాణీకులు, ఉదయం పీక్ అవర్స్‌లో ప్లాట్‌ఫారమ్ కొరత, శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరేందుకు గంట గంటన్నర ప్రయాణ సమయం ఉంటోంది.
అయితే, కొత్త టెర్మినళ్లు అందుబాటులోకి వస్తే, రద్దీ తగ్గుతుంది. ప్రయాణీకులకు సమయం ఆదా అవుతుంది. ట్రైన్స్ ఆగే సమయం తగ్గి, సేవలు వేగవంతం అవుతాయి. నగర మల్టీమోడల్ రవాణా వ్యవస్థ బలపడుతుంది.
అదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మలక్‌పేట రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
భవిష్యత్ హైదరాబాదు
జీహెచ్‌ఎంసీ పరిధిలో జనాభా తీవ్రంగా పెరుగుతోంది. 2025లో 1.13 కోట్ల నుంచి 2031లో 1.84 కోట్లకు, 2047లో 3.30 కోట్లకు (రైల్వే అంచనా) పెరగనుందని అంచనా. ఇంత పెద్ద జనాభాకు సేవలు అందించడానికి, రాబోయే దశాబ్దాల్లో రైలు ప్రయాణాల డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, కొత్త టెర్మినళ్ల నిర్మాణం అత్యవసరమైంది.
అలాగే, టెర్మినళ్ల చుట్టూ భూముల ధరలు పెరగడం, కొత్త వ్యాపారాలు, లాజిస్టిక్స్ కేంద్రాలు స్థాపన, రీజనల్ ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల.. ఇవి అన్ని కలిసి, హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి కొత్త దశను తెరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

