Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సునామీ.. పక్కనే మరో భాగ్యనగరం !
Hyderabad Real Estate: రాయదుర్గంలో ఎకరం భూమి రూ. 237 కోట్లకు చేరడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మౌలిక వసతుల జోరుతో నగరం చుట్టుపక్కల మరో సరికొత్త భాగ్యనగరం రూపుదిద్దుకుంటోంది.

రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్.. సిటీలో కొత్త భాగ్యనగరం పుడుతోందా?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఎవ్వరికీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. గ్లోబల్ లెవెల్‌లో మన సిటీ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. రేట్లు చూస్తుంటే.. అసలు మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా లేక లండన్, న్యూయార్క్‌లో ఉన్నామా అనే డౌట్ రాక మానదు. ఐటీ హబ్ అయిన రాయదుర్గంలో ల్యాండ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (TGIIC) నిర్వహించిన వేలంలో ఎకరం ధర ఏకంగా రూ. 204 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయదుర్గంలోని ప్లాట్ నంబర్ 4 లో ఉన్న 5 ఎకరాల భూమి కోసం వంశీరామ్ బిల్డర్స్ ఏకంగా రూ. 1,000 కోట్లకు పైగా కుమ్మరించి ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఈ రేంజ్ డిమాండ్ చూస్తుంటే, ఇప్పుడున్న సిటీకి పోటీగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో సరికొత్త ‘భాగ్యనగరం’ రెడీ అవుతోందా అనే చర్చ రియల్ ఎస్టేట్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది.
రెండు రోజుల్లో రూ. 2500 కోట్లు.. ఐటీ కారిడార్‌లో ల్యాండ్స్ హాట్ కేక్స్
రాయదుర్గంలో రేట్ల విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. కేవలం రెండు రోజుల క్రితం జరిగిన వేలంలో సత్వ నాలెడ్జి సిటీ పక్కనే ఉన్న ఒక ప్లాట్ ఎకరం ఏకంగా రూ. 237 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడైంది. రెండు రహదారులను కలిపే ప్రైమ్ లొకేషన్ కావడంతో ఆ ఒక్క ల్యాండ్ డీల్ ద్వారానే ప్రభుత్వానికి రూ. 1490 కోట్లు వచ్చాయి.
మొత్తం రెండు విడతల్లో కలిపి కేవలం 11.38 ఎకరాలు వేలం వేస్తే.. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు ఇక్కడే ఆఫీస్ స్పేస్ కావాలని పోటీ పడుతుండటంతో రాయదుర్గం, నార్సింగి ఏరియాలు ఇప్పుడు మోస్ట్ కాస్ట్ లీయెస్ట్ ప్లేసెస్ గా మారిపోయాయి.
మెగా ప్రాజెక్టుల జోరు.. భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ
రాయదుర్గం సక్సెస్‌తో ఉత్సాహం తెచ్చుకున్న హెచ్ఎండీఏ (HMDA) కూడా భారీ లేఅవుట్లతో వేలానికి ప్లాన్ చేస్తోంది. సిటీ చుట్టుపక్కల మౌలిక వసతులను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా పనులు వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి ఆమన్‌గల్లు వరకు నాలుగు లైన్లలో గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నారు. ఇది నగరాన్ని నేరుగా రాబోయే 'భారత్ ఫ్యూచర్ సిటీ'తో కనెక్ట్ చేయనుంది. బుద్వేల్ దగ్గర సిద్ధమవుతున్న భారీ లేఅవుట్‌ను ఔటర్ రింగ్ రోడ్డుతో కలపడానికి ఒక భారీ ఇంటర్‌ఛేంజ్ ట్రంపెట్‌ను కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ కనెక్టివిటీ చూస్తుంటే ఫ్యూచర్ సిటీ రూపంలో మరో మెగా సిటీ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
హకీంపేటలో అప్సెట్ ప్రైస్ రూ. 99 కోట్లు.. తగ్గేదేలే అంటున్న అధికారులు
మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి హెచ్ఎండీఏ కూడా తన ల్యాండ్స్ కనీస ధరలను భారీగా పెంచేసింది. షేక్‌పేట్ మండలం హకీంపేట గ్రామంలోని 8 ఎకరాల 24 కుంటల ప్రైమ్ ల్యాండ్‌కు ఎకరం కనీస ధరను రికార్డు స్థాయిలో రూ. 99 కోట్లుగా ఫిక్స్ చేశారు. అంటే వేలం మొదలవ్వడమే దాదాపు రూ. 851 కోట్ల బేస్ ప్రైస్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట.
అక్షన్‌లో ఈ భూమి ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా రాబట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇది కాకుండా శంకర్‌పల్లి, మేడ్చల్, శేరిలింగంపల్లి ఏరియాల్లో ఉన్న ఖాళీ భూములను కూడా వేలం వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటి ద్వారా మరో రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎంత రేటు? కంప్లీట్ రేట్ కార్డ్ ఇదే
హెచ్ఎండీఏ వెబ్‌సైట్ ప్రకారం త్వరలో వేలానికి రాబోతున్న ప్లాట్ల కనీస ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
• శంకర్‌పల్లి (మోకిల లేఅవుట్): 100 ప్లాట్లు (300 - 500 చ.గజాలు) – కనీస ధర గజానికి రూ. 50,000.
• మేడ్చల్ (మేడిపల్లి లేఅవుట్): 68 ప్లాట్లు (231 - 643 చ.గజాలు) – కనీస ధర గజానికి రూ. 45,000.
• చందానగర్: 484 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 60,000.
• నార్సింగి: 5,687 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 45,000.
• కూకట్‌పల్లి/సూరారం: 4,840 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 60,000.
• పీర్జాదిగూడ: 2,057 చ.గజాలు – కనీస ధర గజానికి రూ. 40,000.
హైదరాబాద్‌లో నివాస, వాణిజ్య సముదాయాలకు డిమాండ్ విపరీతంగా పెరగడం.. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఎంతైనా సరే పెట్టి భూములు కొంటున్నారు. ఈ రియల్ బూమ్ ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో సరికొత్త ఆధునిక భాగ్యనగరాన్ని మనం చూస్తాము.

