Hyderabad: కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా లక్ష్యంగా బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వదంతులు నమ్మొద్దని సూచించారు.

హైదరాబాద్ సిటీలో సడన్‌గా ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ పెద్ద కలకలమే రేపింది. లష్కర్ ఏ తొయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు అక్కడి హోటల్ టూరిస్ట్ ప్లాజాను టార్గెట్ చేసి పేలుళ్లు చేస్తామని హెచ్చరించారని సమాచారం.

అంతేకాదు, 2008 నాటి 26/11 ముంబై దాడుల తరహాలో ఇక్కడ కూడా దాడి చేసి, కనీసం 300 మందిని బలితీసుకుంటామని బెదిరించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నవంబర్ 21న ఈ బెదిరింపు మెయిల్ విషయం స్పెషల్ బ్రాంచ్ దృష్టికి రాగా, నవంబర్ 22 ఆదివారం నాడు ఈ విషయాలు బయటకు రావడంతో సిటీ పోలీసులు ఫుల్ అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

కుల్గామ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారమా?

ఈ బెదిరింపు మెయిల్ వెనుక ఉన్న కారణం గురించి కూడా అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నవంబర్ 18న దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా జంగల్‌పోరా ప్రాంతంలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ కమాండర్ లతీఫ్ భట్, అతని అనుచరులు హతమయ్యారు. నవంబర్ 11న కుల్గాంలో సీఆర్‌పీఎఫ్ టీమ్‌పై జరిగిన దాడిలో నిందితుడైన లతీఫ్ భట్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా ఉందని, అతడు కశ్మీర్‌లో చివరి స్థానిక లష్కర్ కమాండర్‌గా ఉండేవాడని సమాచారం. లొంగిపోవాలని కోరినా వినకపోవడంతో జరిగిన ఆపరేషన్‌లో అతడు చనిపోయాడు. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే హైదరాబాద్‌లో దాడులకు పాల్పడతామని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

సిటీలో ఫుల్ సెక్యూరిటీ.. సైబర్ టీమ్ వేట

ఈ హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా దగ్గర సెక్యూరిటీని భారీగా పెంచడంతో పాటు, సిటీలోని ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలు, కీలక ప్రాంతాల వద్ద కూడా నిఘా ముమ్మరం చేశారు. అన్ని జోన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రద్దీ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ పెంచి, యాంటీ-సబోటేజ్ తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వదిలేసిన బ్యాగులు లేదా వస్తువులు, వాహనాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు, ఈ మెయిల్ నిజంగా ఆ ఉగ్రవాద సంస్థ నుంచే వచ్చిందా లేక ఎవరైనా కావాలనే ఆ పేరుతో పంపారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్‌లు, డిజిటల్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడా బాంబులు గానీ, పేలుళ్లు గానీ జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు; ఇది కేవలం బెదిరింపు మెయిల్ ఆధారంగా తీసుకున్న ముందస్తు భద్రతా చర్య మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.

పబ్లిక్‌కు సీపీ కీలక సూచనలు

ఈ పరిస్థితుల్లో నగర ప్రజలు ఎవరూ భయపడొద్దని, భయాందోళనలకు గురికావద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో లేదా బయట వినిపించే ఫేక్ న్యూస్, వదంతులను అస్సలు నమ్మొద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసి టెన్షన్ క్రియేట్ చేయొద్దని కోరారు. సిటీలో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, లేదా ఎవరైనా వదిలేసిన బ్యాగులు, వస్తువులు కనిపించినా వెంటనే డయల్ '112'కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సేఫ్టీ కోసం హైదరాబాద్ పోలీసులు 24/7 అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు.

Scroll to load tweet…