- Home
- Telangana
- హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లై ఓవర్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్, రియల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లై ఓవర్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్, రియల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Hyderabad: తూర్పు హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టనుంది.

ఈ ఫ్లైఓవర్ అవసరం ఏంటి.?
ఎల్బీనగర్–హస్తినాపురం–బీఎన్ రెడ్డి కారిడార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటిగా మారింది. విజయవాడ జాతీయ రహదారి, ఇన్నర్ రింగ్ రోడ్‌తో పాటు మీర్‌పేట్, బడంగ్‌పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. చిన్న దూరం ప్రయాణించేందుకు కూడా వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కీలకంగా మారింది.
ఫ్లైఓవర్‌తో ప్రయాణం ఎలా మారనుంది?
ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా... ఎల్బీనగర్–హస్తినాపురం–బీఎన్ రెడ్డి మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. మీర్‌పేట్, బడంగ్‌పేట్ ప్రాంతాలకు వేగవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రతిరోజూ ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గుతుంది. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవలకు వేగంగా మార్గం లభిస్తుంది. ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊతం
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం తూర్పు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా హస్తినాపురం, బీఎన్ రెడ్డి, మీర్‌పేట్, బడంగ్‌పేట్, అల్మాస్‌గూడ, పెద్ద అంబర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో భూములు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మెరుగైన రోడ్డు అనుసంధానం వల్ల... కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి పెరగవచ్చు. ఇప్పటికే ఇళ్లను కొనుగోలు చేసిన వారి ఆస్తుల విలువ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. అయితే ఇప్పటివరకు ఫ్లైఓవర్ తుది డిజైన్, అంచనా వ్యయం, భూసేకరణ అవసరాలు, నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ఫ్లైఓవర్ పూర్తయితే తూర్పు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడమే కాకుండా, వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు వేగవంతమైన రాకపోకలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆ ప్రాంత ఆర్థిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూడా కొత్త ఊపు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఒక్క రియల్ ఎస్టేట్‌లోనే కాకుండా మరెక్కడ పెట్టుబడి పెట్టినా ముందుగా నిపుణులు సూచనలు పాటించడం ఉత్తమం.

