హైదరాబాదీలు ఊపిరి పీల్చుకోండి.. పొల్యుషన్ కంట్రోల్‌తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం
Hyderabad: భారీగా పెరుగుతోన్న వాహనాలతో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ దిశగా భారీ అడుగు
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ నుంచి మరో శుభవార్త అందింది. నగర రవాణా వ్యవస్థలో కీలక మార్పు తీసుకొచ్చేలా 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కాలుష్య నియంత్రణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కేంద్రం బిడ్లకు ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సుల సరఫరా మార్గం సుగమమైంది.
బస్సుల సరఫరా ఎవరు చేస్తున్నారు
ఈ ప్రాజెక్ట్‌లో రెండు సంస్థలు అర్హత సాధించాయి. మేఘా గ్రూప్‌కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1085 ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. గ్రీన్‌సెల్ మొబిలిటీ సంస్థ 915 బస్సులను సరఫరా చేయనుంది. దశలవారీగా ఈ బస్సులను ఆర్టీసీకి అప్పగించనున్నారు. అద్దె విధానంలో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి.
నగర కాలుష్యానికి చెక్…
హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా డీజిల్ బస్సుల వల్ల కార్బన్ ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల ఎగ్జాస్ట్ గ్యాస్ సమస్య ఉండదు. శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా ఇది కీలక ముందడుగు కానుంది.
అద్దె ఖర్చు తగ్గితే ఆర్టీసీకి లాభం
ఎలక్ట్రిక్ బస్సులను కిలోమీటర్ అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ వినియోగించనుంది. అద్దె రేట్లపై కేంద్ర ప్రభుత్వం సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఖర్చు తగ్గేలా ఒప్పందం కుదిరితే ఆర్టీసీపై భారం తగ్గనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,878 బస్సులు సేవలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో 2039 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులపైనే ఆధారపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనవరిలోనే కొత్త బస్సులు నగర రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

